Pawan Kalyan : ఆరోగ్యం సహకరించకున్నా.. ఆలయాల యాత్రకు పవన్ కల్యాణ్.. కారణం ఇదే!
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలయాల యాత్రకు శ్రీకారంచుట్టారు. ఆరోగ్యం సహకరించకున్నా.. యాత్రకు బయల్దేరినట్టు పవన్ స్పష్టం చేశారు. అయితే ఈ యాత్రపై రకరకాల పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ.. పవన్ మాత్రం వ్యక్తిగతం అని చెబుతున్నారు. ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం.

కేరళలో పురాతనమైన తిరువల్లం శ్రీపరశురాముడి ఆలయాన్ని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు, ప్రధాన అర్చకులు మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఆరో అవతారమైన శ్రీపరశురాముడికి పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన కుమారుడు కూడా వెళ్లారు.
పూర్తిగా వ్యక్తిగతం..
దక్షిణ భారతంలోని ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. 'దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన పూర్తిగా నా వ్యక్తిగతం. రాజకీయాలకు సంబంధం లేదు. నాలుగున్నరేళ్ల కిందట చెల్లించుకోవాల్సిన మొక్కుల నిమిత్తం యాత్రకు వచ్చా. ఆరోగ్యం సహకరించకున్నా ఆలయాలకు వెళ్తున్నా. కేరళ, తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నా' అని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు.
సంతోషం వ్యక్తం చేస్తున్నా..
'తిరుమల వేంకటేశ్వరస్వామికి కోట్లాది మంది భక్తులు ఉన్నారు. వారి మనోభావాలు గాయపడకూడదన్నదే నా అభిమతం. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నదే నా ఆకాంక్ష. నెయ్యి కల్తీ వ్యవహారంలో పాత్రధారులను అరెస్టు చేయడం దర్యాప్తులో భాగం. దీనిపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నా. భవిష్యత్తులో టీటీడీ ప్రసాదం విషయంలో, ఇతర వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఆయుర్వేద చికిత్స గురించి..
ఎంతో కాలంగా తనను బాధపెడుతున్న స్పాండిలైటిస్ సమస్యకు ఆయుర్వేదంలో అవలంబించే చికిత్స విధానాలను.. పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలు, మొక్కల గురించి.. అక్కడి వైద్యులు పవన్ కల్యాణ్‌కు వివరించారు. అగస్త్య మహర్షి పురాణాలు, వేదాల్లో చెప్పినట్లు మర్మ చికిత్సకు మూలికలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నారు.
పొలిటికల్ కామెంట్స్..
అయితే పవన్ ఆలయాల యాత్రపై పొలిటికల్ కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేయబోతున్నారని.. అందుకే ముందస్తుగా ఈ యాత్ర చేపట్టారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సౌత్ ఇండియాలో బీజేపీ పవన్‌ను ఆయుధంగా భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.