తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త - డీఏ పెంపుపై ప్రకటన-deputy cm bhatti announcement on 2 percent da for electricity employees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త - డీఏ పెంపుపై ప్రకటన

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త - డీఏ పెంపుపై ప్రకటన

విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. 2 శాతం డీఏను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి ప్రకటన చేశారు. ఈ పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే అమలు కానుంది.

విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులతో పాటు పెన్షనర్ల డీఏను 2 శాతం పెంచింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. ఈ పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే అమలు కానుందని వెల్లడించారు.ఈ నిర్ణయంలో 71,417 మంది ఉద్యోగులు,పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

దేశానికి దిక్సూచి కావాలి - డిప్యూటీ సీఎం భట్టి

ఉద్యోగుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అందులో భాగంగా విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 శాతం DA పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుందని వెల్లడించారు.

జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుతో విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా రూ.11.19 కోట్ల భారం పడినా… ఉద్యోగుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 2023లో 15,000 మెగావాట్లుగా ఉన్న పీక్ డిమాండ్… 2025 నాటికి 17,162 మెగావాట్లకు పెరగడం ప్రభుత్వ యాజమాన్యంపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో 2030 నాటికి 26,000 మెగావాట్లు, 2035 నాటికి 33,000 మెగావాట్లకు డిమాండ్ పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

దానికి తగిన విధంగా ప్రభుత్వం ఇప్పటికే న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను రూపొందించిందని భట్టి గుర్తు చేశారు. 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తోందని చెప్పారు.

“భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనడానికి సిబ్బంది సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం, విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబంగా కలిసి పనిచేస్తూ తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నాను” అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.