Weather Updates : వాయుగుండం ఎఫెక్ట్ - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
Cyclone Midhili Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం… తీవ్ర వాయుగుండంగా మారిందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Weather Updates : పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం… బుధవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది తుఫాన్‌గా మారితే ‘మిథిలి’గా పేరు పెట్టనున్నారు. ఉత్తర ఈశాన్యదిశగా వాయవ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ గురువారం ఉదయానికి ఒడిశా తీరానికి… నవంబరు 18వ తేదీ నాటికి పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని ఐఎండీ పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు
వాయుగుండం ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది. ఇక సీమ ప్రాంతంలో ఇవాళ, రేపు వర్షాలు పడుతాయని వెల్లడించింది.
ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం:
వాయుగుండం ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
ఇక తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్ష సూచన లేదని పేర్కొంది. ఉదయపు వేళల్లో పొగ మంచు వాతావరణం ఉంటుందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఉపరితల గాలులు ఈశాన్య దిశల నుంచి గంటకు 6 - 10 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంటుందని వివరించింది.