AP Special Category Status : ప్రత్యేక హోదాపై బీహార్ కు నో చెప్పిన కేంద్రం, ఏపీకి హోదా లేనట్లేనా?
AP Special Category Status : పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బీహార్ కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం పరోక్షంగా సమాధానం ఇచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
AP Special Category Status : బీహార్ ప్రత్యేక హోదా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. అయితే కేంద్రం తాజా వైఖరి ఏపీకి కూడా ప్రత్యేక హోదా లేదని పరోక్షంగా చెప్పినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీహార్ నుంచి జేడీయూ, ఏపీ నుంచి టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఈ రెండు పార్టీల మీద ఆధారపడే కేంద్ర ప్రభుత్వం ఏర్పడిందని చెప్పవచ్చు. ఏపీ, బీహార్ సహా పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పదేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తుంది. ఏపీ, తెలంగాణ విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. సాక్ష్యాత్తు అప్పటి ప్రధానమంత్రి పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత కేంద్రంలో అధికారం మారడం, ఏపీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక హోదా హామీ నెరవేరలేదు. పదేళ్ల తర్వాత మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో మరోసారి టీడీపీ కీలకంగా మారింది. దీంతో ఈసారైనా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని విశ్లేషకులు భావించారు. అయితే ఏపీ ఆశలపై కేంద్రం పరోక్షంగా నీళ్లు చల్లింది.
బీహార్ ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రకటన
ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ (ఐఎంజీ) నివేదిక 2012 ప్రకారం బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. దీంతో బీజేపీ ప్రధాన మిత్రపక్షమైన నితీష్ కుమార్ జేడీయూకు పెద్ద ఎదురుదెబ్బ తగినట్లు అయ్యింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్ సభ జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్ కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం స్పష్టంచేశారు. ప్రణాళిక సహాయం కోసం ప్రత్యేక హోదాను జాతీయ అభివృద్ధి మండలి గతంలో కొన్ని రాష్ట్రాలకు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ప్రత్యేక హోదా పొందేందుకు కొండలు, క్లిష్టమైన భూభాగం, తక్కువ జనసాంద్రత లేదా గిరిజన జనాభాలో గణనీయమైన వాటా, పొరుగు దేశాలతో సరిహద్దుల కలిగి వ్యూహాత్మక స్థానం, ఆర్థిక మౌలిక సదుపాయాల వెనుకబాటుతనం, రాష్ట్ర ఆర్థిక వనరుల ఆచరణ సాధ్యం కాని పరిస్థితులు ఉండాలి.
అయితే బీహార్ లో ఈ పరిస్థితులు లేవని, దీంతో సమగ్రంగా ఆలోచన చేసి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రత్యేక హోదా కోసం బీహార్ చేసిన అభ్యర్థనను ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ (ఐఎంజీ) నివేదిక ఆధారంగా పరిశీలించామన్నారు. ఎన్డీసీ ప్రమాణాల మేరకు బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని లోక్ సభలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న జేడీయూ పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో తన డిమాండ్ ను మరోసారి కేంద్రం ముందుపెట్టింది.
ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్
2014లో ఏపీ విభజన అనంతరం ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ డిమాండ్ చేసింది. రాజకీయ పార్టీలకు ప్రత్యేక హోదా ప్రచారాస్త్రంగా మారింది. ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని భావించారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రం చెబుతోంది. కేంద్రంలోని బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ భయం ఉండడంతో.. టీడీపీ ప్రత్యేక హోదాపై పట్టుబట్టాలని సాధ్యం అయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే బీహార్ కు ప్రత్యేక హోదా లేదని కేంద్రం స్పష్టం చేయడంతో ఏపీకి కూడా ప్రత్యేక హోదా లేదనే సంకేతాలు కేంద్రం పంపిందని విశ్లేషకులు అంటున్నారు.
సంబంధిత కథనం