CM Chandrababu : "ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా ఇచ్చినవి ఏంలేవు. అన్ని పాత బకాయిలే. విభజన చట్టంలోనివే ఇచ్చారు. ఏపీకి ఏదో ఇచ్చారని అందరూ అంటున్నారు. పోలవరం, రాజధాని, వెనుకబడిన ప్రాంతాలు ఇవన్నీ విభజన చట్టంలోవే" అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో జరిగిన నీతి ఆయోగ్ తొమ్మిదో పాలక మండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సమస్యలు, ఆర్థిక పరిస్థితిపై వివరించారు. నీతి ఆయోగ్ సమావేశంలో దాదాపు 20 నిమిషాలు పాటు చంద్రబాబు మాట్లాడారు.
అనంతరం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను సీఎం చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా పోలవరం అంశాన్ని లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఆమోదం తెలపాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
"ఆంధ్రప్రదేశ్‌కి విభజన చట్టంలో ఉన్నవే ఇచ్చారు. అమరావతి, పోలవరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అన్ని విభజన చట్టంలోనే ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దానికి బదులు క్యాపిటల్ పెట్టుబడికి సహాయం చేస్తామని అన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తలసరి ఆదాయంలో రూ.30 వేలు తేడా ఉంది. గడిచిన ఐదేళ్లలో ఏపీ పరిస్థితి విభజన కంటే అధ్వాన్నంగా తయారైంది. తలసరి ఆదాయం పడిపోయింది. అమరావతి, పోలవరం నాశనం అయ్యాయి. పరిశ్రమలు పారిపోయాయి. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలన ప్రజలు చూశారు. అందుకే మాకు చారిత్రాత్మక విజయాన్ని ఇచ్చారు. ఏపీ ప్రజలు ఎన్డీఏపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అందుకనే ఓటు వేశారు. రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం సహాయం చేమని అడుగుతున్నాం. రాష్ట్రానికి నష్టం జరగడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను ప్రజలకు మాకు ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలే అడుగుతున్నాం. కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. కావాలని రాజకీయం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు" అని హితవు పలికారు.
‘‘కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన నిధులు దారి మళ్లించారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. విభజన చట్టం ప్రకారమే ఏపీకి రావాల్సినవే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకంగా ఏదో ఇచ్చినట్లు కొందరు రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనే విభజన చట్టాన్ని రూపకల్పన చేసింది. జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల నిధులు దారి మళ్లించారని, ఈ రెండింటిలో చాలా రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబడి ఉంది. ఏ మంత్రిత్వ శాఖ దగ్గరకు వెళ్లిన రాష్ట్రం వెనుకబడిన గణాంకాలే చూపిస్తున్నారు. అమరావతి, పోలవరం విషయంలో సాయం చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాను. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాం. రాష్ట్ర మంత్రి వర్గం చేసిన తీర్మానాన్ని అందజేశాను. పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన రూ.12,500 కోట్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపాలని కోరాను. నవంబర్ నుంచి పోలవరం పనులు ప్రారంభం అవుతాయి. మొదటి రెండు సీజన్‌లు కొత్త డయాఫ్రం వాల్ కట్టడానికే సరిపోతుంది. తరువాత కాఫర్ డ్యాం నిర్మిస్తాం" అని చంద్రబాబు అన్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం