Village Secretariats: సచివాలయాలతో సాధించిదెంత… జాతీయ స్థాయిలో చర్చ-debate at the national level on how much has been achieved with the secretariats ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Village Secretariats: సచివాలయాలతో సాధించిదెంత… జాతీయ స్థాయిలో చర్చ

Village Secretariats: సచివాలయాలతో సాధించిదెంత… జాతీయ స్థాయిలో చర్చ

HT Telugu Desk HT Telugu
Jul 03, 2023 10:18 AM IST

Village Secretariats: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దేశంలో మరెక్కడ లేని విధంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పబ్లిక్ పాలసీ కోర్సుల్లో చర్చనీయాంశం అయ్యింది.

<p>గ్రామ సచివాలయం</p>
గ్రామ సచివాలయం

Village Secretariats: ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు,అసలైన సుపరిపాలన అందుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 2019 అక్టోబర్ 2నప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు కావాల్సిన పౌర సేవలన్నింటిని వారి నివాసాలకు సమీపంలో అందే ఏర్పాటు చేసింది.

ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ప్రతి వార్డులో కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేసి దాదాపు లక్షా 30వేలకు పైగా ఉద్యోగులతో సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాలకు అనుబంధంగా ప్రతి 50ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించారు. వారి ద్వారా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

ఏపీలో అమలు చేస్తున్న సచివాలయ వ్యవస్థను ఇప్పటికే పలు రాష్ట్రాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించాయి. కేరళతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన బృందాలు సచివాలయాల పనితీరును పరిశీలించి తమ రాష్ట్రాల్లో వాటిని అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. పొరుగున ఉన్న తెలంగాణలో సైతం ప్రతి వార్డులో ఓ సెక్రటేరియట్ తరహా కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోవైపు సచివాలయాల ఏర్పాటుపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దేశంలో పబ్లిక్ పాలసీ కోర్సుల్లో భాగంగా ఆలిండియా సర్వీస్ అధికారులకు, వృత్తి నిపుణులకు ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తుంటారు. ఈ కోర్సుల్లో భాగంగా పిఎంఓలో పనిచేసిన మాజీ IAS అధికారి ఏపీలో అమలు చేస్తున్న సచివాలయ వ్యవస్థపై, అక్కడ చదువుతున్న వారితో చర్చాగోష్టిలో పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డ్ సచివాలయం వ్యవస్థల మీద పలువురు అధికారులు లేవనెత్తిన సందేహాలపై ఆయన వివరణ ఇచ్చినట్లు సామాచం. గ్రామ సచివాలయ వ్యవస్థ సాధించినది ఏమిటి అనే విషయం మీద చర్చ సాగినట్లు తెలుస్తోంది. వినడానికి అందంగా, అద్భుతంగా, ప్రయోగాత్మకంగా, విజయవంతమైన విధానంగా ప్రచారం పొందినా, నాలుగేళ్లలో అది సుపరిపాలన, జవాబుదారీతనం విషయంలో గుణాత్మక ఫలితాలు నమోదు చేయలేదని స్పష్టం ఆయన తేల్చేశారట.

లక్షన్నర ఉద్యోగాల కల్పన మినహా ప్రజలకు నేరుగా సేవలు అందించేలా స్వతంత్ర పాలన యంత్రాంగాన్ని నిర్మించడంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం వ్యవస్థ విజయం సాధించలేదు అని అభిప్రాయపడ్డారు. పౌర సేవల విషయంలో ప్రచార ఆర్భాటాల కంటే ప్రజలకు నిజమైన సేవలు ఎంతమేరకు అందుతున్నాయనే మదింపు నిజాయితీ చేయాలని పిఎంఓలో సలహాదారుగా పని చేసిన సదరు అధికారి అభిప్రాయపడ్డారు. మహాత్మ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కార్యదర్శిగా సైతం పనిచేసిన ఆ అధికారి రాజకీయ ప్రేరేపిత ఉద్దేశాలకు అతీతంగా గ్రామ స్వరాజ్యం రావాల్సి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఈ చర్చలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ‌్యంగా సచివాలయ వ్యవస్థల ఏర్పాటుతో ప్రజల దైనందిన జీవితంలో వచ్చిన గుణాత్మక మార్పు ఏమిటి , వాటి ఉపయోగాలు, ప్రభుత్వాల సేవల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా నేరుగా అన్ని విభాగాల నుంచి పౌర సేవలు అందించడంలో ఎంత మేరకు సఫలం అవుతున్నాయనేది తేలాల్సి ఉందని ఆ అధికారి మే 7న జరిగిన చర్చలో పేర్కొన్నారు. దీనిపై ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం.

Whats_app_banner