Visakha Pharma Blast: అచ్యుతాపురం ఫార్మా పేలుడులో భారీగా పెరిగిన మృతులు.. నేడు ఘటనా స్థలానికి CM చంద్రబాబు-death toll in achyutapuram pharma explosion has increased chandrababu visit today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Pharma Blast: అచ్యుతాపురం ఫార్మా పేలుడులో భారీగా పెరిగిన మృతులు.. నేడు ఘటనా స్థలానికి Cm చంద్రబాబు

Visakha Pharma Blast: అచ్యుతాపురం ఫార్మా పేలుడులో భారీగా పెరిగిన మృతులు.. నేడు ఘటనా స్థలానికి CM చంద్రబాబు

Sarath chandra.B HT Telugu
Aug 22, 2024 06:53 AM IST

Visakha Pharma Blast: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ ‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.ఇప్పటి వరకు 17మంది ప్రాణాలు కోల్పోగా 60మంది గాయపడ్డారు.నేడు ప్రమాదస్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు.

అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా బ్లాస్ట్‌లో భారీగా పెరిగిన మృతులు
అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా బ్లాస్ట్‌లో భారీగా పెరిగిన మృతులు (HT_PRINT)

Visakha Pharma Blast: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్ ఫార్మా కంపెనీలో జరిగిన విస్పోటనంలో మృతుల సంఖ్య 17 దాటింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

నేడు ప్రమాద స్థలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళనున్నారు. ఫార్మా ప్రమాదంలో గాయపడిన వారిని పరామర‌్శిస్తారు. మృతుల కుటుంబాలను ఓదార్చనున్నారు. మూడేళ్ల క్రితం ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటన జరిగినపుడే ఫ్యాక్టరీల్లో ప్రమాణాలపై పలు సందేహాలు వ్యక్తమైనా అధికారులు మొద్దు నిద్ర వీడలేదు. తాజా ఘటనలో ప్రాణ నష్టం భారీగా ఉండటం అందరిని కలిచి వేసింది.

ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక…

అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు జరగలేదని, సాల్వెంట్ లీక్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఈ మేరకు ఫ్యాక్టరీస్ విభాగం డైరె క్టర్ చంద్రశేఖరవర్మ ప్రభుత్వానికి నివేదించారు.

ఫార్మా కంపెనీ 'రియాక్టర్లలో తయారైన మిథైల్ టెర్ట్- బ్యుటైల్ ఈధర్ మిశ్ర మాన్ని స్టోరేజ్ ట్యాంకులోకి మార్చేపుడు ఆ మిశ్రమం లీకైందని పేర్కొన్నారు. ప్రొడక్షన్ బ్లాక్ లోని రియాక్టర్ నుంచి పీడీ ల్యాబ్ ద్వారా ట్యాంకులోకి రసాయనాన్ని సరఫరా చేసే సమయంలో సాల్వెంట్ లీకేజి ఏర్పడినట్టు వివరించారు. ఆ మిశ్రమం బయట వాతావరణంలో రసాయన చర్యలకు గురై ఆవిరిగా మారిందని పేర్కొన్నారు.

వాతావరణంలోని ఇతర వాయువులతో కలవడంతో ఒక్కసారిగా పేలుడు జరిగి ఫ్యాక్టరీలో భారీ విస్పోటనం సంభవించినట్టు పేర్కొన్నారు. సాల్వెంట్‌ లీకుల్ని గుర్తించే అలారమ్‌లు పనిచేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియాక్టర్‌ నుంచి ట్యాంకుకు సరఫరా అయ్యే క్రమంలో లీక్ అయితే వెంటనే హెచ్చరికలు వచ్చే వ్యవస్థలు ఫ్యాక్టరీలో ఉండాలి. ఫ్యాక్టరీ వాతావరణంలో మార్పుల్ని గుర్తించే అత్యాధునికి భద్రతా వ్యవస్థలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆవిరి రూపంలో వాయువులు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించినా ఎందుకు గుర్తించలేదో పరిశోధిస్తున్నారు.

అధికారులతో బాబు టెలికాన్ఫరెన్స్…

అచ్యుతాపురం ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అచ్యుతాపురం ప్రమాదం పై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులతో సిఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు తెలుసుకున్న సిఎం, అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి....బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు.

ఇప్పటి వరకు 17 మంది చనిపోయారని వివరించిన అధికారులు...కొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వివరించారు. ప్రమాదానికి కారణాలు ఏంటనే విషయంలో ప్రాధమిక సమాచారాన్ని సిఎంకు వివరించారు. ప్లాంట్ నిర్వహణలో మానవ తప్పిదం, ప్లాంట్ నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని సిఎంకు వివరించారు. ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని తెలిపారు. ముందు బాధితుల ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు.

గురువారం చంద్రబాబు అచ్యుతాపురానికి వెళ్లి ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటల తరువాత విజయవాడ నుంచి విమానంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడనుంచి హెలికాప్టర్‌లో అచ్యుతాపురం సెజ్‌కు వెళతారు. అనంతరం అనకాపల్లిలో ఎన్టీఆర్‌ ఏరియా ఆస్పత్రి, మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని, అక్కడినుంచి విశాఖ చేరుకుని కేజీహెచ్‌ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

మృతుల వివరాలు…

1. నీలపు రామిరెడ్డి (49), అసోసియేట్ జనరల్ మేనేజర్/అసోసియేట్ డైరెక్టర్, కొత్త వెంకోజీపాలెం, విశాఖపట్నం

2. హంస ప్రశాంత్ (34), సీనియర్ ఎగ్జిక్యూటివ్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా

3. మహంతి నారాయణరావు (34), అసిస్టెంట్ మేనేజర్/టీమ్ లీడర్, అర్తమూరు, గరివిడి, విజయనగరం జిల్లా

4. కొప్పర్తి గణేష్ కుమార్ (33), సీనియర్ ఎగ్జిక్యూటివ్, జువ్వలదొడ్డి, బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా

5. చల్లపల్లి హారిక (22), ట్రైనీ ఇంజనీర్, రమణయ్యపేట, కాకినాడ

6. పైడి రాజశేఖర్ (23) ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్, వంజంగి, ఆముదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా

7. మారిశెట్టి సతీశ్ (31), సీనియర్ ఎగ్జిక్యూటివ్, పాశర్లపూడి, తూర్పుగోదావరి జిల్లా

8. మొండినాగబాబు (36), అసిస్టెంట్ మేనేజర్, సామర్లకోట

9. నాగేశ్వర రామచంద్రరావు (47), అసిస్టెంట్ మేనేజర్/టీమ్ లీడర్, కూర్మన్నపాలెం, విశాఖ

10. వేగి సన్యాసినాయుడు (53), హౌస్ కీపింగ్ బాయ్, అనకాపల్లి

11. ఎల్లబిల్లి చిన్నారావు (27), పెయింటర్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా

12. జవ్వాది పార్థసారథి (27), ఫిట్టర్, పార్వతీపురం

13. పూడి మోహన్ దుర్గా ప్రసాద్, హౌస్ కీపింగ్ బాయ్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా

14.జే.చిరంజీవి (25)

15.జే.ఆనందరావు (35)

16. ఎం. సురేంద్ర, అశ్వారావుపేట, ఖమ్మం

17. పి.వెంకటసాయి.

పవన్ కళ్యాణ్‌ సమీక్ష…

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి కర్మాగారాల్లో భద్రతను డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్, ఫైర్, కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో ఉండే పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి.

కాలుష్య నియంత్రణ మండలి మాత్రం నిబంధనల అతిక్రమణ జరిగిందా? అంతా సక్రమంగానే ఉన్నాయా అనే విషయాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రమాదం వైఫల్యానికి ఎవరు బాధ్యులు అనే విషయమై పవన్ కళ్యాణ్‌ ఆరా తీశారు. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రై. లిమిటెడ్ పేరిట కొనసాగుతున్న ఈ రసాయనిక కర్మాగారానికి ఇద్దరు యజమానులు ఉన్నారు. ఈ యజమానులు ఇద్దరి మధ్యన విబేధాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలియచేశారు.

రియాక్టర్ పేలి ఈ ప్రమాదం సంభవించిందని బయటకి ప్రచారం జరుగుతున్నా సాల్వెంట్ ఆయిల్ ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంప్ చేసే క్రమంలో లీకై మంటలు చెలరేగాయని అనంతరం పెద్ద పేలుడుతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.

ప్రమాద ప్రాంతాన్ని స్వయంగా వచ్చి పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించడానికి రావడానికి ఉప ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేసినా సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందన్న అధికారుల సూచనతో ఆ యోచనను తాత్కాలికంగా విరమించుకున్నారు. భారీ స్థాయిలో ప్రమాదం జరగడం 16 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడడం తీవ్రంగా కలచివేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాట్లాడారు.

ఒకే ప్రాంతంలో తరచూ ఇటువంటి ప్రమాద ఘటనలు జరుగుతుండటంతో సేఫ్టీ ఆడిట్‌ ప్రాముఖ్యతపై అధికారులకు సూచనలు చేశారు. ఫ్యాక్టరీలు, అగ్నిమాపక శాఖ, పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రతా సంస్థ, కార్మిక శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి సేఫ్టీ ఆడిట్ చేపట్టి భద్రత ప్రమాణాలు, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు.