NMMS Scholarship 2024 : నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్స్ - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎంపికైతే రూ. 48 వేలు-deadline to apply for nmms scholarships extended to 3rd october 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nmms Scholarship 2024 : నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్స్ - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎంపికైతే రూ. 48 వేలు

NMMS Scholarship 2024 : నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్స్ - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎంపికైతే రూ. 48 వేలు

HT Telugu Desk HT Telugu
Sep 26, 2024 06:00 PM IST

ఎన్ఎంఎంఎస్ స్కాల‌ర్ షిప్స్‌ ద‌ర‌ఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు అప్లికేషన్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం సంచాలకులు డి. దేవానంద రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ స్కాలర్ షిప్స్ కు ఎంపికైన విద్యార్థుల‌కు మొత్తం రూ.48 వేలు అందుతాయి.

ఎన్ఎంఎంఎస్ స్కాల‌ర్ షిప్ - దరఖాస్తుల గడువు పొడిగింపు
ఎన్ఎంఎంఎస్ స్కాల‌ర్ షిప్ - దరఖాస్తుల గడువు పొడిగింపు

ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ (ఎన్ఎంఎంఎస్) స్కాల‌ర్ షిప్స్ ప‌రీక్ష (2024-25) ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గ‌డువును అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు పొడిగించారు. ఈ మేర‌కు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం సంచాలకులు డి. దేవానంద రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఎంఎంఎస్ పరీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థుల‌కు నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12 వేలు చొప్పున మొత్తం రూ.48 వేలు స్కాల‌ర్ షిప్ అందిస్తారు.

2024 డిసెంబ‌ర్ 8న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాల‌ర్ షిప్స్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకొనుటకు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్‌సైట్ www.bse.ap.gov.in లో 2024 ఆగ‌స్టు 5 నుండి అందుబాటు ఉంచిన‌ట్లు తెలిపారు.

ఈ పరీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని తొలిత సెప్టెంబ‌ర్ 17గా నిర్ణ‌యించ‌గా, తాజా గ‌డువును 2024 అక్టోబ‌ర్ 3 వరకు పొడిగించారు. ప్రింటెడ్ నామినల్ రోల్, ఒరిజినల్ ఎస్‌బీఐ కలెక్ట్ రశీదును సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించుటకు చివరి తేదీ 2024 అక్టోబ‌ర్ 14 నిర్ణ‌యించ‌డం జ‌రిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు, వ‌సతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుతూ కుటుంబ సంవత్సరాదాయం రూ. 3,50,000 లోపు ఉన్న విద్యార్ధులు అందరూ ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. నమోదు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డ్‌లో ఉన్న విధంగానే విద్యార్థి పేరు నమోదు చేయాలి.

దరఖాస్తు చేసుకొనుటకు ఎటువంటి ధృవపత్రాలు అవసరం లేదు. అయితే పరీక్ష రాసే సమ‌యానికి అన్ని ధృవపత్రాలు సిద్ధం చేసుకోవాలి. పరీక్ష రుసుము ఓసీ, బీసీ విద్యార్దులకు రూ.100, ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు రూ. 50గా నిర్ణ‌యించారు. పూర్తి వివరముల కోసం ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్‌సైటు www.bse.ap.gov.in నందు గానీ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో గాని తెలుసుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానంద రెడ్డి తెలియ‌జేశారు.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఉప‌కార వేత‌నాలు అందిస్తోంది. ఎన్ఎంఎంఎస్ పరీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థుల‌కు నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12 వేలు చొప్పున మొత్తం రూ.48 వేలు స్కాల‌ర్ షిప్ అందిస్తారు. 7, 8 త‌ర‌గ‌తి పాఠ్యాంశాల ఆధారంగా ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప్ర‌శ్న‌ప‌త్రం తెలుగు, ఇంగ్లీష్ మాధ్య‌మాల్లో రెండు విభాగాల్లో ప‌రీక్ష ఉంటుంది. మొద‌టి విభాగంలో మానసిక సామర్థ్య ప‌రీక్ష‌, రెండో పేప‌ర్ విష‌య సామ‌ర్థ్యంపై బహుళ ఐచ్చిక ప్ర‌శ్న‌లు (మ‌ల్టిపుల్ ఛాయిస్ క్వాశ్చ‌న్స్‌) అడుగుతారు.

ఒక్కో విభాగానికి 90 మార్కులు ఉంటాయి. మొత్తం 180 మార్కుల‌తో ప్ర‌శ్న‌ప‌త్రం ఉంటుంది. ఈ ప‌రీక్ష రాసేందుకు విద్యార్థుల‌కు మూడు గంట‌ల స‌మ‌యం ఉంటుంది. అర్హ‌త సాధించిన వారికి నాలుగేళ్ల పాటు (9,10 త‌ర‌గ‌తులు, రెండేళ్ల ఇంట‌ర్మీడియ‌ట్) ప్ర‌తి ఏటా రూ.12 వేలు స్కాల‌ర్ షిప్ అందిస్తారు. అయితే తొమ్మిదో త‌ర‌గ‌తిలో 55 శాతం మార్కులు, ప‌దో త‌ర‌గ‌తిలో 60 శాతం మార్కులు, ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రంలో 55 శాతం శాతం మార్కులు సాధిస్తేనే స్కాల‌ర్ షిప్ అందుతుంది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం