Konaseema Crime : ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చిన కుమార్తె.. కోనసీమ జిల్లాలో దారుణం
Konaseema Crime : కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. కుమార్తె వివాహేతర సంబంధం పెట్టుంది. ఆ విషయం తెలిసి తండ్రి మందలించాడు. కోపం పెంచుకుని ప్రియుడితో కలిసి తండ్రిని కుమార్తె అతికిరాతకంగా హతమార్చింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండపేటలోని 22వ వార్డు మేదరపేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయనకు వస్త్రాల వెంకట దుర్గ అనె కుమార్తె ఉంది. కుమార్తెకు వివాహం అయింది. కానీ.. రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది.
మందలించిన తండ్రి..
ఆమె వివాహేతర సంబంధంపై ఊళ్లోవాళ్లు చర్చించుకుంటున్నారు. కుమార్తె వివాహేతర సంబంధం గురించి తండ్రి సూరా రాంబాబుకు తెలిసింది. కుమార్తెను పిలిచి ఇది పద్దతి కాదు, ఊళ్లోవాళ్లు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు.. ఇలాంటి పనులు వద్దూ అంటూ మందలించాడు. కోపోద్రిక్తురాలైన కుమార్తె వెంకట దుర్గ.. కన్న తండ్రేనే హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ విషయం ప్రియుడు ముమ్మిడివరపు సురేష్‌తో చెప్పింది. ఆయనతో కలిసి తండ్రి హత్యకు పథకం రచించింది.
పీక నులిమేసి..
ఈనెల 16న రాత్రి తండ్రి ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియుడు సురేష్‌కు ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించింది. ప్రియుడు తనకు తోడుగా స్నేహితుడు తాటికొండ నాగార్జునను తీసుకొని వెళ్లాడు. కుమార్తె, ఆమె ప్రియుడు, ఆయన స్నేహితుడు కలిసి మంచంపై రాంబాబు ఛాతిపై కూర్చోని పీక నులిమేసి కిరాతకంగా హత్య చేశారు. ఆ తరువాత అక్కడినుంచి పరారయ్యారు.
సోదరుడికి అనుమానం..
ఈనెల 17న ఉదయం స్థానికులు గమనించి.. సాధారణ మరణం అనుకున్నారు. ఈ విషయం తెలిసి మృతుడి సోదరుడు అక్కడికి చేరుకున్నాడు. మరణించిన తన సోదరుడిని చూశాడు. ఘటనా స్థలాన్ని మొత్తం పరిశీలించాడు. ఆయన కుమార్తె గురించి ఆరా తీస్తే.. ఆమె అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయనకు అనుమానం వచ్చింది. తన సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడని, ఆయన కుమార్తె వెంకట దుర్గపైనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సోదరుడి ఫిర్యాదుతో..
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
హత్య అని నిర్ధారణ..
పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత, అది సాధారణ మరణం కాదని, హత్య అని పోలీసులు నిర్ధారించారు. పరారీలో ఉన్న నిందితుల వెంకటదుర్గ, సురేష్, నాగార్జునల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖపట్నం పారిపోతున్న ముగ్గురు నిందితులను గురువారం అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితులు నేరం అంగీకరించారు. వారిని రామచంద్రపురం కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించగా.. ముగ్గురు నిందితులను జైలుకు పంపించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)