Dasara Traffic Diversion : రేపట్నుంచి శరన్నవరాత్రులు…విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు-dasara festival traffic diversion in vijayawda by city police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Dasara Festival Traffic Diversion In Vijayawda By City Police

Dasara Traffic Diversion : రేపట్నుంచి శరన్నవరాత్రులు…విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

HT Telugu Desk HT Telugu
Sep 25, 2022 12:17 PM IST

Dasara Traffic Diversion విజయవాడలో దేవీ శరన్నవరాత్రులు రేపట్నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఉత్సవాలు జరిగే సమయంలో విజయవాడ నగర వ్యాప్తంగా భారీ వాహనాలను నగరంలోకి అనుమతించరు.

రేపట్నుంచి ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
రేపట్నుంచి ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Dasara Traffic Diversion దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ మీదుగా ప్రయాణించే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భారీ, మధ్య తరహా వాహనాలను మళ్లిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా తాతా ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

దుర్గగుడి ఉత్సవాల సందర్భంగా ప్రజల సౌకర్యార్థం నగర వ్యాప్తంగా పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. ఈ నెల 25వ తేదీ రాత్రి నుంచి అక్టోబరు 5వ తేదీ రాత్రి వరకు నగరంలో వాహనాలు మళ్లిస్తున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు….

హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్‌ మీదుగా మళ్లిస్తారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాాలు ఇలాగే వెళ్లాల్సి ఉంటుంది. విశాఖ నుంచి వచ్చే వాహనాలు హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.

చెన్నై వైపు వెళ్లే వాహనాలు…

విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌ మీదుగా గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా మళ్లిస్తారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలు ఒంగోలు నుంచి దారి మళ్లిస్తారు.

గుంటూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు కూడలి, పెనుమూడి వారధి మీదుగా అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తారు. విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలను హనుమాన్ జంక్షన్‌ మీదుగా దారి మళ్లిస్తారు.

చెన్నై నుంచి హైదరాబాద్‌ రాకపోకలు సాగించే వాహనాలను మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌ వెళ్లాలి. హైదరాబాద్‌ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు కూడా నార్కట్‌ పల్లి, మిర్యాలగూడ, నడికుడి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

ఆర్టీసీ బస్సులు..

విజయవాడ నుంచి హైదరాబాద్, జగ్గయ్యపేట, తిరువూరు వైపు వెళ్లు బస్సులను పండిట్‌ నెహ్రూ బస్టేషన్, కనకదుర్గా పైవంతెన, స్వాతి కూడలి, గొల్లపూడి వై కూడలి, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తారు. విజయవాడ వైపు వచ్చే బస్సుల్ని కూడా ఫ్లైఓవర్ మీదుగానే అనుమతిస్తారు.

విజయవాడ సిటీ బస్టాప్‌ నుంచి విద్యాధరపురం, పాల ప్రాజెక్టు మధ్య నడిచే ఆర్టీసీ బస్సులను పండిట్‌ నెహ్రూ బస్టేషన్, పాత పోలీస్‌ కంట్రోల్‌రూం, గద్ద బొమ్మ కూడలి, కాళేశ్వరరావుమార్కెట్, పంజా సెంటరు, వీజీ చౌక్, చిట్టినగర్‌ మీదుగా పంపిస్తారు.

మూలా నక్షత్రం రోజున అక్టోబరు 1 రాత్రి నుంచి అక్టోబరు 2 రాత్రి వరకు ఆర్టీసీ, సిటీ బస్సులను కనకదుర్గా పై వంతెన, కాళేశ్వరరావు మార్కెట్‌ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. కేవలం కాలినడకన వెళ్లే వారిని మాత్రమే ఈ మార్గాల్లో అనుమతిస్తారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు పీఎన్‌బీఎస్, పాత పీసీఆర్, చల్లపల్లి బంగ్లా కూడలి, ఏలూరు లాకులు, బుడమేరు వంతెన, పైపులరోడ్డు, వై.వి.రావు ఎస్టేట్, సీవీఆర్‌ పై వంతెన, సితార, గొల్లపూడి వై కూడలి, ఇబ్రహీంపట్నం మీదుగా పంపిస్తారు. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే మార్గంలో బస్టాండ్‌ వైపు రావాల్సి ఉంటుంది.

మూలా నక్షత్రం రోజున ప్రకాశం బ్యారేజీపై ఏ విధమైన వాహనాలను అనుమతించరు.

నగరంలో తిరిగే వాహనదారులు కనకదుర్గ పై వంతెన మీద నుంచి లేదా చిట్టినగర్‌ సొరంగం నుంచి భవానీపురం వైపు వెళ్లాలి. కుమ్మరిపాలెం నుంచి ఘాట్‌ రోడ్డు, ఘాట్‌ రోడ్డు నుంచి కుమ్మరిపాలెం వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు.

పార్కింగ్‌ ప్రదేశాలు….ఎక్కడెక్కడంటే

ద్విచక్రవాహనాలను పద్మావతి ఘాట్, ఇరిగేషన్‌ పార్కింగ్, గద్దబొమ్మ పార్కింగ్, లోటస్‌ అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ వద్ద నిలుపుకోవాలి.

కార్లను రాజీవ్‌గాంధీ పార్కు పక్క రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్‌ సెల్లార్‌ పార్కింగ్, గాంధీజీ మున్సిపల్‌ హైస్కూల్, తితిదే పార్కింగ్‌ కుమ్మరిపాలెంలో నిలపాలి.

బస్సుల్ని పున్నమి ఘాట్, భవానీ ఘాట్, సుబ్బారాయుడికి చెందిన ఖాళీస్థలం, పాత సోమా కంపెనీ స్థలం, సితార కూడలి వద్ద నిలపాలి.

టూరిస్ట్‌ బస్సుల్ని హైదరాబాద్‌ నుంచి వచ్చే టూరిస్ట్‌ బస్సులు పున్నమిఘాట్‌ లేదా భవానీ ఘాట్‌లో నిలపాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి వచ్చే టూరిస్ట్‌ బస్సులు ఆర్టీసీ వర్క్‌షాపు వద్ద ఉన్న సోమా కంపెనీ స్థలంలో నిలపాలి. గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులు భవానీపురం దర్గా ఎదురుగా ఉన్న సుబ్బారాయుడి స్థలంలో నిలపాలి. భక్తులు తిరిగి వెళ్లే సమయంలో పార్కింగ్‌ చేసిన ప్రదేశం వద్దనే బస్సు ఎక్కాలి. వారు వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లాలని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు.

IPL_Entry_Point

టాపిక్