AP TG Weather Updates : తీరం దాటిన 'దానా' తీవ్ర తుపాన్ - ఉత్తరాంధ్రకు హెచ్చరికలు
Cyclone Dana : "దానా"తీవ్రతుపాన్ తీరం దాటింది. రాత్రి1.30 నుంచి తెల్లవారుజామున 3. 30 గంటల మధ్యతీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన "దానా"తీవ్ర తుపాన్ తీరం దాటింది. హబాలిఖాతి నేచర్ క్యాంప్(భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. రాత్రి1. 30 నుంచి తెల్లవారుజాము 3. 30 గంటల తీరం దాటగా… ఇది పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ మధ్యాహ్నాం నుంచి క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేసింది.
ఉత్తరాంధ్రకు హెచ్చరికలు…
దానా తీవ్ర తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక అలర్ట్ ఇచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతంగా ఉంటుందని పేర్కొంది. చెదురుమదురుగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో మూడు నాలుగు రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 27వ తేదీ నుంచి మళ్లీ తేలికపాటి లేదా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్టోబర్ 30వ తేదీ వరకు వానలు పడొచ్చని... కొన్నిచోట్ల మాత్రం ఈ అవకాశం ఉందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
ఒడిశాపై తీవ్ర ఎఫెక్ట్…!
దానా తుపాను తీరం దాటడంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఒడిశాతో పాటు బెంగాల్ రాష్ట్ర తీర ప్రాంతంలో గాలులు వీస్తున్నాయని… భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో భద్రక్, కేంద్రపారా జిల్లాల్లోని తీరం వద్ద సాధారణం కంటే 1-1.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయని వివరించారు.
జగత్సింగ్పూర్, కేంద్రపడా, కటక్, భద్రక్, జాజ్పూర్, బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (>20 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జాజ్పూర్, భద్రక్, పూరీ, ధెంకనాల్, ఖోర్ధా, కటక్, జగత్సింగ్పూర్, కేంద్రపడా, అంగుల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (>20 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు.