Mocha Cyclone: బంగాళాఖాతంలో మోచా తుఫాన్..మత్స్యకారులకు హెచ్చరికలు-cyclone mocha in bay of bengal govt issues warning to fishermen ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cyclone Mocha In Bay Of Bengal, Govt Issues Warning To Fishermen

Mocha Cyclone: బంగాళాఖాతంలో మోచా తుఫాన్..మత్స్యకారులకు హెచ్చరికలు

HT Telugu Desk HT Telugu
May 08, 2023 06:43 AM IST

Mocha Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. మంగళ, బుధవారాల్లో వాయుగుండంగా మారి ఆ తర్వాత ఉత్తరదిశగా కదులుతూ తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఏపీ తెలంగాణలో వర్షాలు
ఏపీ తెలంగాణలో వర్షాలు

Mocha Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పాడే తుఫాను ప్రభావాన్ని వాతావరణ శాఖ పరిశీలిస్తోంది. మోచా తుఫాను బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీరాల దిశగా వెళ్లే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

దక్షిణ, తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఆవర్తనం సోమవారం ఉదయంలోగా అల్పపీడనంగా మారనుందని 9న ఇది తీవ్ర వాయుగుండం కానుందని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ఆదివారం సాయంత్రం తెలిపారు. మే 10న వాయుగుండం తుపానుగా మారనుండగా, దీనికి యెమన్‌ దేశం 'మోచా'గా నామకరణం చేసింది. మే9న ఉత్తర దిశగా మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి ఆ తరువాత ఏ దిశగా కదులుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తుఫాను గమనంపై మంగళవారం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. సముద్రంలో ట్రాలర్లు, మర బోట్ల ద్వారా చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారులు 8వ తేదీ సాయంత్రం లోగా ఒడ్డుకు చేరుకోవాలని హెచ్చరించామని ఐఎండి తెలిపింది. మరోవైపు విదేశీ వాతావరణ అధ్యయన సంస్థలు తీవ్ర తుపానుగా మారనున్న మోచా మయన్మార్‌ వద్ద తీరం దాటుతుందని, దాని వల్ల ఒడిశాకు ముప్పు ఉండదని విశ్లేషిస్తున్నాయి.

అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహయం, సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుండడంతో రాగల మూడు రోజులు గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

 

WhatsApp channel