Mandous Cyclone : దూసుకొస్తున్న మాండస్… దక్షిణకోస్తాలో హై అలర్ట్…..-cyclone mandous may hit south coastal districts of andhra prdesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cyclone Mandous May Hit South Coastal Districts Of Andhra Prdesh

Mandous Cyclone : దూసుకొస్తున్న మాండస్… దక్షిణకోస్తాలో హై అలర్ట్…..

HT Telugu Desk HT Telugu
Dec 09, 2022 07:23 AM IST

Mandous Cyclone బంగాళా ఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాను పట్ల ముఖ్యంగా రాయలసీమ,దక్షిణ కోస్తాల జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుండి తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై తిరుపతి, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైయస్సార్ కడప జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మరోవైపు మాండస్ తుఫాను నేపథ‌్యంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించడానికి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్ సూచించారు.

మాండస్ తుఫాను ముప్పుపై సమీక్ష నిర్వహిస్తున్న చీఫ్ సెక్రటరీ
మాండస్ తుఫాను ముప్పుపై సమీక్ష నిర్వహిస్తున్న చీఫ్ సెక్రటరీ

Mandous Cyclone ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాల వైపు దూసుకొస్తున్న మాండస్ తుఫాను ముప్పును గణనీయంగా తగ్గించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సిఎస్ జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లకు సూచించారు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం మాండస్ తుఫాను ఈనెల 9వతేదీ అర్ధరాత్రి నాటికి పుదుచ్చేరి,మహా బలిపురం,శ్రీహరికోటల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపారు.ఈప్రభావంతో ఈనెల 10వ తేదీ వరకూ రాయలసీమ,దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయా జిల్లాల కలక్టర్లు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లాల్లో ఒకటి, నెల్లూరు జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 మొత్తం 5 ఎన్డిఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు డా.జవహర్ రెడ్డి తెలిపారు.అలాగే ప్రకాశం, నెల్లూరు,తిరుపతి,చి త్తూరు జిల్లాలో ఒకటి వంతున మొత్తం 4 ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. వర్షాలు,భారీ వర్షాలతో ఎక్కడైనా రహదారులకు లేదా ఇతర కమ్యునికేషన్ వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తితే సత్వర చర్యలు తీసుకునేలా సర్వసన్నద్ధమై ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న సిఎం…

బంగాళాఖాతంలో తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీఎంఓ అధికారుల సమావేశంలో తుపాను పరిస్థితులపై సీఎం సమీక్షించారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కలిగించాలని, వారికి సహాయకారిగా నిలవాలని సీఎం ఆదేశించారు.

గంటకు 12 కి.మీల వేగంతో తుఫాను ప్రయాణం…

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా కొనసాగుతున్న మాండూస్, గడిచిన 6 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12కి.మీ వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి జఫ్నాకి తూర్పు ఆగ్నేయంగా 240కి.మీ., కారైకాల్‌కు 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు గుర్తించారు. 6 గంటల పాటు తీవ్ర తుఫానుగా తీవ్రతను కొనసాగించి, ఆ తర్వాత క్రమంగా బలహీనం పడుతుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం తెల్లవారు జాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మాండస్ తుఫాను తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనావ వేసింది. తుఫాను ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నాయి. మిగిలినచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూచించారు.

IPL_Entry_Point

టాపిక్