గ్రూప్‌ 1 కేసులో బిగ్‌ అప్డేట్.. ఏపీపీఎస్సీలో ముగ్గురు అధికారులకు బిగుస్తున్న ఉచ్చు..-crucial information emerges in police probe implicating three appsc officers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  గ్రూప్‌ 1 కేసులో బిగ్‌ అప్డేట్.. ఏపీపీఎస్సీలో ముగ్గురు అధికారులకు బిగుస్తున్న ఉచ్చు..

గ్రూప్‌ 1 కేసులో బిగ్‌ అప్డేట్.. ఏపీపీఎస్సీలో ముగ్గురు అధికారులకు బిగుస్తున్న ఉచ్చు..

Sarath Chandra.B HT Telugu

ఏపీపీఎస్స గ్రూప్‌ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి.ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్‌ డీజీతో పాటు కామ్‌సైన్‌ ప్రతినిధిని ఆదివారం పోలీసులు విచారించారు. ఈ క్రమంలో ముగ్గురు ఏపీపీఎస్సీ ఉద్యోగులకు కుట్రలో భాగం ఉన్నట్టు గుర్తించారు.

గ్రూప్‌ 1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో బిగ్ అప్డేట్

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారం ముగ్గురు కమిషన్‌ ఉద్యోగుల పాత్రను పోలీసులు గుర్తించారు. వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు సిద్ధం అవుతున్నారు. గ్రూప్‌1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో మాజీ ఇంటెలిజెన్స్‌ డీజీ పిఎస్సార్‌ ఆంజనేయులుతో పాటు కామ్‌సైన్‌ ప్రతినిధిని పోలీసులు ఆదివారం విచారించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో పోలీసుల విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కేసులో ఏపీపీఎస్సీ ఉద్యోగులు ముగ్గురికి ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పబ్లక్ సర్వీస్ కమిషన్‌ జవాబు పత్రాలను ఎవరి ఆదేశాలతో థర్డ్‌ పార్టీ వాల్యూయేషన్‌కు అప్పగించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో 2020-21 మధ్య కాలంలో కమిషన్ బాధ్యతలు పర్యవేక్షించిన పిఎస్సార్ ఆంజనేయులుతో పాటు కామ్‌సైన్‌ సొల్యూషన్స్‌ ప్రతినిధిని విజయవాడ సూర్యారావు పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కోర్టు అనుమతితో ఆదివారం వారిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. కమిషన్‌ బాధ్యతలు నిర్వర్తించిన పిఎస్సార్ ఆంజనేయులు పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని బయట పెట్టలేనని మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారంలో కామ్‌సైన్‌కు పనులు అప్పగించడంపై పోలీసులు ఆరా తీశారు. గ్రూప్‌ 1 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే సమయంలో కోర్టు వివాదాలు తలెత్తడంతో వాటిని హాయ్‌లాండ్‌లో మూల్యాంకనం చేశారు. ఈ పనులు ఎవరి ద్వారా ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారనే కోణంలో పోలీసులు ఆరా తీశారు.

ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకటసుబ్బయ్య, జాయింట్‌ సెక్రటరీ ప్రసాద్‌, అడిషనల్ సెక్రటరీ నరసింహ మూర్తిల ద్వారా జవాబు పత్రాల మూల్యాంకనం పనులు అప్పగించినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో నరసింహ మూర్తి ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఇంఛార్జి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దీంతో ఈ కేసులో వీరిని కూడా నిందితులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 నియామకాల్లో అక్రమాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకనంలో మార్కుల వ్యత్యాసం రావడంతో గ్రూప్‌ 1 పోస్టుల భర్తీలో బయటకు తెలియని కుట్ర కోణం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి ఆదేశాలతో మూల్యాంకనం ప్రక్రియను మార్చారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

పోలీసుల విచారణలో కమిషన్‌ ఉద్యోగుల పాత్ర స్పష్టం కావడంతో వారిని కూడా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులతో మూల్యాంకనం చేపట్టినా జవాబు పత్రాలను అనర్హులతో మూల్యాంకనం చేయించడం వెనుక కుట్ర కోణాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలలో కుట్ర కోణం వెలుగు చూస్తే అది నియామకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గ్రూప్‌ 1 నియామకాలు పూర్తి చేసుకుని ఆర్డీఓ, డిఎస్పీ స్థాయిల్లో ఉద్యోగాల్లో కూడా చేరిపోవడంతో ఈ దర్యాప్తు ఎక్కడికి దారి తీస్తుందనే ఆసక్తి నెలకొంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం