IAS Transfers: అయ్యో బాబూ.. మళ్లీ వాళ్లేనా! ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులపై పెదవి విరుపు..
IAS Transfers: ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతుంటాయి తప్ప ప్రభుత్వాన్ని నడిపించే అధికారులు మాత్రం మారరు. ఏపీలో నిన్న మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకే మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కడంపై అధికార వర్గాలు పెదవి విరుస్తున్నారు.
IAS Transfers: వాళ్లంతా నిన్న మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారు. రాజకీయ నాయకులు చెప్పిందల్లా చేశారు. ప్రాధాన్య పోస్టింగులు దక్కించుకోడానికి వెనుకా ముందు ఆలోచించకుండా ఆదేశాలు జారీ చేశారు. కొందరైతే తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు కూడా మూటగట్టుకున్నారు. చెప్పిన పని చేయడం, కోరిన పోస్టింగ్ దక్కించుకోవడమే లక్ష్యంగా కొందరు ఐదేళ్లు పనిచేశారు. అలాంటి అధికారుల్లో కొందరికి మళ్లీ కొందరికి కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత దక్కడంపై బ్యూరోక్రాట్లలో విస్మయం వ్యక్తం అవుతోంది.
ముఖ్యమంత్రులకు కాదు ముఖ్యమంత్రి స్థానాలకు విధేయులం అంటూ ఐదేళ్లుగా అంతులేని అధికారాన్ని అనుభవించిన పలువురు ఐఏఎస్‌లు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంలో కీలకం అయ్యారు. తాజా బదిలీల్లో కీలక బాధ్యతలు దక్కిన వారిలో కొందరికి ప్రాధాన్య పోస్టులు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల్లో కొందరు ప్రభుత్వం మారగానే వైసీపీకి దగ్గరయ్యారు. గతంలో అక్రమాలు జరిగాయంటూ కొత్త ప్రభుత్వానికి ఉప్పందించారు. రాగద్వేషాలకు అతీతంగా నిబంధనలకు ప్రకారం పనిచేయాల్సిన అధికారులు తాము ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉన్నాఅదే రకమైన సహకారం అందిస్తామంటూ ప్రభుత్వానికి దగ్గరయ్యారు.
ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కొలువుదీరింది. మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పూర్తైంది. దీంతో అధికార వ్యవస్థను ప్రక్షాళన ప్రారంభించారు. ఈ క్రమంలో సిఎంఓ మొదలుకుని అన్ని శాఖలకు కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు.
గతంలో వైసీపీకి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన అధికారులకు కూడా కొత్త ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కింది. వైసీపీ ప్రభుత్వంలో సిఎంఓ నుంచి రాష్ట్రాన్ని నడిపించిన వివాదాస్పద ఐఏఎస్ అధికారి తప్ప అంతా పాతవాళ్లనే కొనసాగించారనే విమర్శలు ఉన్నాయి. సిఎంఓలో పోస్టింగ్ దక్కిన ఓ అధికారిపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.
ఆయన పనితీరు, నిర్లక్ష్యపు స్వభావం, అధికార దుర్వినియోగంపై తోటి అధికారులే అసహనం వ్యక్తం చేసుకుంటారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారికి శిష్యుడిగా గుర్తింపు పొందారు. అలాంటి అధికారిని సిఎంఓలో కొనసాగిస్తే గుట్టు మొత్తం ప్రత్యర్థుల గుప్పెట్లో పెట్టినట్టేనని ప్రచారం జరుగుతోంది.
వివాదాస్పద నిర్ణయాల్లో కీలకం…
మాజీ సిఎస్ ఆదేశాలతో ఎన్నికలకు ముందు వివాదాస్పద అంశాల్లో నివేదికల్ని తయారు చేేసి అమోదింప చేయడానికి ప్రయత్నించిన అధికారి సిఎంఓలో చోటు దక్కింది. సొంత రాష్ట్రంలో ఆయన కుల ధృవీకరణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రాతినిథ్యం కల్పించే క్రమంలో సమర్థులు, నిజాయితీపరులకు చోటు కల్పించకుండా వివాదాస్పద అధికారుల్ని చేర్చడంపై సచివాలయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వైసీపీ హయాంలో పత్రికల్లో వ్యతిరేక కథనాలు రాసినందుకు ఐఏఎస్ అసోసియేషన్ పేరిట హంగామా చేసి నాటి ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఓ పార్టీని గెలిపించేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాల్లో కీలకంగా వ్యవహరించారు.
ఉద్యోగులు సమస్యలు చెప్పుకోడానికి వస్తే వారిని నీచంగా చూస్తారని, విపరీతమైన అహంకారంతో ప్రవర్తించే అధికారికి చోటు కల్పించడంపై ముఖ్యమంత్రి పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారం కోసం పదవిలో ఉన్న వారు ఏమి చెప్పినా చేసే వ్యక్తుల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమంత్రులకు భజన చేస్తూ వారికి వాస్తవాలు తెలియనివ్వకుండా మరుగున పెట్టి అంతా సవ్యంగా సాగుతుందని చెప్పే అధికారులతో గతంలో ప్రభుత్వాలకు జరిగిన నష్టమే ఇప్పుడు కూడా జరుగుతుందని చెబుతున్నారు.
ఆ అధికారులకు ప్రాధాన్య పోస్టింగులు?
వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన గోపాలకృష్ణద్వివేది, ప్రవీణ్ కుమార్, సాయిప్రసాద్ వంటి వారికి కూడా కీలక బాధ్యతలు అప్పగించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2019లో ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన గోపాల కృష్ణ ద్వివేది ఎన్నికలు పూర్తైన తర్వాత కీలక పోస్టింగులు దక్కించుకున్నారు.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా వివాదాస్పదంగా మారిన గనుల శాఖను మూడున్నరేళ్లకు పైగా ఆయన నిర్వహించారు. ఇసుక రీచ్‌లు మొదలకుని ఖనిజ సంపద దోపిడీలో ఆయన పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కార్మిక శాఖతో పాటు గనుల శాఖ బాధ్యతలు కూడా ద్వివేదికి అప్పగించారు. తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌కు గనుల శాఖ డైరెక్టర్ పోస్టింగ్ ఇచ్చారు. భూపరిపాలన శాఖ ప్రత్యేక కమిషనర్ ఉన్న సాయిప్రసాద్ కు జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిం చింది. సాయిప్రసాద్ గతంలో టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినా వైసీపీ అధికారంలోకి రాగానే వారికి అనుకూలంగా మారిపోయారనే విమర్శలు ఉన్నాయి.
సంబంధిత కథనం