Budameru Relief: బుడమేరు వరద పరిహారం చెల్లింపుపై సీపీఎం ఆందోళన, అందరికీ ఇచ్చేశామని హోంమంత్రి ప్రకటనపై ఆగ్రహం
Budameru Relief: విజయవాడ నగరాన్ని వరదల ముంచెత్తి ఆర్నెల్లు గడిచినా పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించక పోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు బుడమేరు వరదల్లో నష్టపోయిన బాధితులు అందరికీ పరిహారం చెల్లించేశామని అసెంబ్లీలో హోంమంత్రి ప్రకటించారు.

Budameru Relief: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి ఆర్నెల్లు పూర్తయ్యాయి. బాధితుల్ని ఉదారంగా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ పరిహారం అందని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి.దాదాపు పది రోజుల పాటు వరద ముంపులో సర్వం కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటామని ప్రకటించింది. వరద సాయం లెక్కింపుపై రెవిన్యూ అధికారులు హడావుడిగా ఎన్యూమరేషన్ చేయడంతో వేలాది కుటుంబాలకు పరిహారం అందలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా వారికి నష్ట పరిహారాన్ని మాత్రం చెల్లించలేదు.
ఈ క్రమంలో ఆరు నెలలు గడిచినా బుడమేరు వరద బాధితులకు ప్రభుత్వ సహాయం అందక పోవడంపై సీపీఎం ఆందోళన బాట పట్టింది. అందరికీ సాయం అందించామని శాసనమండలిలో మంత్రులు ప్రకటనలు చేయడాన్ని తప్పు పట్టారు.
విరాళాల్లో బాధితులకు ఇచ్చింది రూ.274కోట్లే…
బుడమేరు వరదల్లో నష్ట పోయిన కుటుంబాలు నేటికీ పూర్తిగా కోలుకొలేదని, వరద బాధితుల ఫిర్యాదులపై స్పందన కొరవడిందని ప్రజలు అందించిన విరాళాలు రూ.497 కోట్లలో బాధితులకు ఇచ్చింది 274 కోట్లేనని సీపీఎం ఆరోపించింది. మరోవైపు బుడమేరు వరద ముంపు నివారణ శాశ్వత చర్యలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తు్నారు.
బుడమేరు వరద సహాయంపై కేంద్ర ప్రభుత్వం, కూటమి సర్కారు నోరు విప్పక పోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు అందించిన సహాయంపై వార్డు సభలు నిర్వహించాలని,వాటికి మంత్రులు హాజరై ప్రజల గోడు వినాలని డిమాండ్ చేశారు.
బుడమేరు వరదల్లో ముంపుకు గురైన వారిలో వేలాది మందికి రకరకాల కారణాలతో పరిహారం చెల్లించలేదని, 190 రోజులు గడిచినా నేటికీ బుడమేరు వరద బాధితులకు అందరికీ సహాయం అందకపోవటం శోచనీయమని సీపీఎం రాష్ట్ర నాయకుడు బాబురావు ఆరోపించారు.
శాసనమండలిలో అందరికీ సహాయం అందించామంటూ మంత్రులు అవాస్తవ ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వరద బాధితులు ఇచ్చిన దరఖాస్తులపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు? ఎంత మందికి సహాయం చేశారు? ఎందుకు నిరాకరిస్తున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
వరద బాధితుల సహాయం కోసం 497 కోట్ల రూపాయలు ప్రజలు విరాళాలుగా అందించారు. కార్మికులు, ఉద్యోగులు సైతం తమ వేతనం నుండి సహాయం అందించారు.విరాళాల డబ్బులకు ప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టకపోగా వాటిలో కూడా 274 కోట్ల రూపాయలు మాత్రమే బాధితులకు సహాయం రూపంలో అందించారని, మిగిలిన డబ్బు ఏమైంది ?ఎందుకు ఖర్చు పెట్టరు? సహాయం అందడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
బుడమేరు వరదతో 7వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని , సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారని, ఆరు నెలలు గడిచినా కేంద్రం ఎందుకు స్పందించదు? కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు నిలదీయదన్నారు. డబుల్, త్రిబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి వరద బాధితులు కూడా సహాయం అందించలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండటం సిగ్గుచేటని సీపీఎం విమర్శించింది.
బాధితులందరికీ పరిహారం చెల్లించామంటూ ప్రకటన
బుడమేరు వరద బాధితులకు పరిహారం చెల్లింపులో తీవ్ర విమర‌్శలు ఉన్నా ప్రభుత్వం వాటిని తోసిపుచ్చుతోంది. వరద బాధితులకు సాయంపై శాసనమండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటన చేశారు.
వరద సాయంపై బాధితులు వస్తే కలెక్టర్ల ద్వారా ఇప్పటికీ పరిష్కరిస్తున్నామని చెప్పారు. వరద బాధితులకు నేరుగా సాయాన్ని వారి ఖాతాలకే నగదు బదిలీ చేశామని, వరద బాధితులు ఇంకా లక్షల మంది ఉన్నారనే ఆరోపణల్ని ఖండించారు. జగన్ ఇచ్చిన రూ.కోటి సాయంపై కమిటీ వేద్దామా అంటూ హోంమంత్రి కౌంటర్ ఇచ్చారు.
విరాళాలు రూ.497కోట్లు…
విజయవాడ వరదబాధితులను ఆదుకోవడానికి రూ.497.07 కోట్లు విరాళంగా వచ్చాయని, సెప్టెంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 16,2025 వరకూ స్వీకరించిన విరాళాలు (చెక్కులు, ఆన్ లైన్ ద్వారా కలిపి) రూ.317.09 కోట్లు ఉన్నాయని, పీడీ ఖాతాల ద్వారా ఉద్యోగుల విరాళాలు రూ.143.79 కోట్లు వచ్చాయని, సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చిన సీఎస్ఆర్ నిధులు రూ.36.189 కోట్లు వచ్చాయని తెలిపారు.
విరాళాలలో నుంచి రూ.274.95 కోట్లతో వరదబాధితులకు ఆర్థిక సాయం, ఉపశమన చర్యలు చేపట్టినట్టు వివరించారు. రూ.271.63 కోట్ల మొత్తాన్ని గ్రామ,వార్డు సచివాలయాల శాఖ సంబంధిత జిల్లా కలెక్టర్ నుంచి డీబీటీ పద్ధతిలో వరద బాధితులకు నేరుగా సాయం అందించినట్టు పేర్కొన్నారు. రూ.3.60 లక్షలను ఇతర సాంకేతిక, సహాయక అవసరాలకు వినియోగించినట్టు ప్రకటించారు.
సంబంధిత కథనం