CPM Mahadharna : ఇళ్ల స్థలాల కోసం కదంతొక్కిన కామ్రేడ్లు - విజయవాడ కలెక్టరేట్ వద్ద మహాధర్నా
CPM Maha Dharna at Vijayawada : సీపీయం ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద పేదలు మహాధర్నా నిర్వహించారు. ఇల్లు కేటాయించాలని… పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్ల స్థలాల విషయంపై దృష్టి పెట్టాలన్నారు.
ఇళ్ల స్థలాలు, టిడ్కో కేటాయింపు ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. సీపీయం నగర కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పేదలు పాల్గొన్నారు. మండుటెండను లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ప్రభుత్వం వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని నినాదాలు చేశారు.
ఏడు సంవత్సరాల క్రితం డబ్బు చెల్లించినప్పటికీ… ఇప్పటివరకు ఇల్లు రాలేదని టిడ్కో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల పేరుతో 35,000 వసూలు చేసి ఖాళీ స్థలాలు కూడా చూపించలేదన్నారు. పట్టాల రిజిస్ట్రేషన్ పేరుతూ ఎన్నిరోజులు కాలం వెళ్లదీస్తారని ప్రశ్నించారు. ధర్నా చేస్తున్న ప్రజల వద్దకు డిఆర్ఓ లక్ష్మీనరసింహం వచ్చి దరఖాస్తుల స్వీకరించారు. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
స్పష్టమైన ప్రకటన చేయాలి - సీపీయం నేతలు
అనంతరం పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ లక్ష్మీశాను కలిసి దరఖాస్తులు అందించారు. సమస్యలను వివరించారు. వీలైనంత త్వరలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధర్నా సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, డి కాశీనాథ్, కే శ్రీదేవి మాట్లాడుతూ….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలలు గడిచినా ఉలుకు పలుకు లేదని విమర్శించారు. అందరికీ ఇల్లు అంటూ 11 ఏళ్ల నుంచి కేంద్రంలోని మోదీ సర్కార్ మోసం చేస్తోందని దుయ్యబట్టారు.
చిత్తశుద్ధి ఉంటే ఉగాది రోజున ముఖ్యమంత్రి పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్పష్టమైన ప్రకటన చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ సిటీలో పలు ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లతో పాటు ఖాళీ స్థలాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆ జాగలను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు హామీలు నిలబెట్టుకోవాలని సీపీయం నేతలు కోరారు. పేదలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని లేనిపక్షంలో… ఏప్రిల్ 15వ తేదీ తర్వాత జక్కంపూడి సింగనగర్ కబేళాలో ఖాళీగా ఉన్న ఇళ్లను లబ్ధిదారుల స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.