Polavaram Floods: గోదావరి వరద కారణం కాదు.. పోలవరం ముంపేనంటున్న సిపిఎం
Polavaram Floods: ముంపు మండలాల్లో గ్రామాలు మునిగిపోవడానికి గోదావరి వరద ప్రవాహం కారణం కాదని, పోలవరం కాఫర్ డ్యామ్‌లేనని సిపిఎం ఆరోపించింది. గోదావరి సహజ ప్రవాహానికి అడ్డు కట్ట వేయడంతోనే వరద వెనక్కి తన్ని గ్రామాలు మునిగిపోతున్నాయని ఆరోపించారు.
Polavaram Floods: పోలవరం ముంపుపై సమగ్ర అధ్యయనం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గోదావరి వరదల్లో గ్రామాలు ఇప్పటికీ నీటి ముంపులోనే ఉండటానికి పోలవరం నిర్మాణమే కారణమని ఆరోపించారు. వరదల కారణంగా ముంపునకు గురైన మండలాల్లో సిపిఎం బృందం పర్యటిస్తోంది. పోలవరం వరద ముంపునకు గురైన రంపచోడవరం జిల్లా ఏటపాక మండలం నెల్లిపాక పంచాయతీ పరిధిలోని వీరాయి గూడెంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితలను సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

గోదావరికి సాధారణంగా వచ్చే వరదలైతే ప్రవాహం కిందకు వెళ్లిపోయేదని కాఫర్ డ్యామ్ అడ్డు పడటంతో బ్యాక్ వాటర్ కారణంగా గ్రామాలు మునిగిపోతున్నాయని వివరించారు. ముంపుకు కారణం వరదలు కాదని పోలవరం బ్యాక్ వాటర్ వరదలేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.
పోలవరం ముంపు మండలాలైన ఎటపాక, కూనవరం, వి.ఆర్.పురం, చింతూరు మండలాలలో ముంపునకు గురైన పలు గ్రామాలలో స్థానిక నాయకులతో కలిసి గురువారం పర్యటించారు. బాధితుల కష్టాలు విని వారిని ఓదార్చారు. పోలవరం ముంపు బాధితులందరికీ న్యాయం జరిగేంత వరకు సిపిఎం అండగా ఉంటుందని చెప్పారు.
32 అడుగులకే వరద ప్రవాహం…
భద్రాచలం దగ్గర 42 అడుగులకు వరద చేరితే వీరాయి గూడెం గ్రామంలోకి నీరు వచ్చేదని, ఇప్పుడు భద్రాచలం దగ్గర 35 అడుగులు వచ్చేసరికే ఊళ్లు అన్నీ మునిగి పోతున్నాయని వివరించారు. ఎగువ కాఫర్ డ్యాం అడ్డు పడడంతో గ్రామాలు బ్యాక్ వాటర్‌తో మునిగిపోతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగానే బ్యాక్ వాటర్ ముంపు పరిస్థితి ఏర్పడుతున్నందున ముంపుకు గురైన గ్రామాలన్నింటిని ముంపు గ్రామాలుగా గుర్తించి, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
బాధితుల విషయంలో ఉదారంగా స్పందించాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వరదలు వస్తే కొట్టుకుపోండి లేదా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పడం అన్యాయమంటున్నారు. ప్రజలను ఎలాగైనా తరిమేయాలనే దుష్ట బుద్ధి తప్ప ఆదుకోవాలి, పునరావాసం కల్పించాలన్న సత్సంకల్పం ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరిని సిపిఎం ఖండిస్తోందని, ఇప్పటికైనా తప్పుదిద్దుకుని బాధితులని ఆదుకోకపోతే వైసిపి ప్రభుత్వానికి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు.
ఆగష్టు 7న ఢిల్లీలో పాదయాత్ర….
పోలవరం ముంపు బాధితులందరికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలవరం పోలికేక పేరుతో సిపిఐ(ఎం) పాదయాత్ర తర్వాత మరలా సర్వే చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వరదలను చూసైనా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
చింతూరుతో సహా ఎటపాక మండలంలోని గ్రామాల ప్రజలు మూట ముల్లె సర్దుకుని స్కూళ్ళలోను, అవకాశం ఉన్న చోట్ల తలదాచుకోవడానికి వారంతట వారు ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పారు . వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తారని చెప్పారని, ప్రజల్లో సహాయం అందక అసంతృప్తి ఉంది కనుక ఇప్పుడే రామంటున్నారన్నారని ఆరోపించారు.
సహాయ శిబిరాలలోకి వెళ్ళిన వారికి దొండకాయలు, దుంపలు ఇచ్చారు తప్ప అక్కడ వండేందుకు బియ్యం, నీళ్ళు లేవని, మంచినీళ్ళు కూడా కొనుక్కోవలసి వస్తోందన్నారు. కొండల మీద ఉన్న వాళ్ళకు పరకాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
వరద శిబిరాల్లోకి వచ్చిన వారికి ప్రభుత్వమే ఉచితంగా తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. శిబిరాలు వదిలివెళ్ళిపోయేప్పుడు రెండు వేలు ఇస్తాం అని పేర్లు నమోదు చేసుకున్నారు తప్ప ఎవరికీ ఇవ్వలేదన్నారు. పోలవరం మ్యాపులు చూస్తే ప్రజల సమస్యలు అర్ధం కావని, వారి దగ్గరకు వెళ్ళి గ్రామాల్లో ఊరూరా రోడ్డుమార్గాన తిరిగితే ముఖ్యమంత్రికి వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు.
ముంపు బాధితులకు తాత్కాలికంగా ఊరట కలిగించి రాజకీయ చేయడం కాకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ముంపు గ్రామాలన్నింటినీ గుర్తించి వారి పునరావాసానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడవ తేదిన ఢిల్లీలోని పార్లమెంటు వద్ద నిర్వహించనున్న ధర్నా సందర్భంగా రాష్ట్రపతిని, కేంద్ర మంత్రులను కలిసి నిర్వాసితుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్తామన్నారు.