JNNURM Houses: విజయవాడలో పేదల కోసం నిర్మించిన పదివేల ఇళ్లను ఆరేళ్లుగా లబ్దిదారులకు కేటాయించకుండా వృధాగా వదిలేయడంతో వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది. నిర్మాణం పూర్తైన ఇళ్ల సంరక్షణ పట్టించుకోక పోవడంతో అవి అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9నెలలు గడిచినా ఇళ్లను పేదలకు కేటాయించక పోవడాన్ని వామపక్షాలు తప్పు పడుతున్నాయి. పేదల కోసం నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం కేటాయించక పోతే పేదలే వాటిని స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని సీపీఎం హెచ్చరించింది.
పేదలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో జవహర్లాల్ నెహ్రూ (JNNURM) స్కీం క్రింద నిర్మించిన వందలాది ఇళ్ళ సముదాయాన్ని సీపీఎం బృందం సందర్శించింది.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో భాగంగా 7 ఏళ్ళ క్రితం నిర్మించి పేదలకు కేటాయించకుండా వృధాగా ఉంచడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. సెక్యూరిటీ లేక పోవడంతో మందు బాటిళ్లు, వ్యర్థ పదార్థాలతో నిండిపోయాయి. నిర్మాణం పూర్తైన ఇళ్లను తక్షణమే ఇళ్లను పేదలకు కేటాయించాలని కోరుతూ నిరసన తెలిపారు
విజయవాడలో పేదలు నెలకు కూ.3వేల నుండి రూ.5వేల రూపాయలు అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని స్థానికులు సీపీఎం నేతలతో ఆవేదన వ్యక్తం చేశారు
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల కోసం ఏడేళ్ల క్రితం ఒక్కొక్కరు రూ. 70 వేల రూపాయలు చెల్లించినా ఇప్పటికీ జక్కంపూడిలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కేటాయించలేదని, ఇల్లు కేటాయించకపోయినా బ్యాంకులు వడ్డీతో సహా బకాయిలు బలవంతంగా వసూలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు
ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళు తమ కళ్ళముందే ఉన్నా , తమకు కేటాయించక పోవడంపై అద్దెదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ గృహాల్లో గంజాయి, బ్లేడ్ బ్యాచులు, అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారాయని, రక్షణ కొరవడిందని ఆరోపిస్తున్నారు.
పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఇళ్ళు ఇస్తామని హామీలతో పాలకులు మోసం చేస్తున్నారని, ప్రభుత్వాలు మారినా గృహ నిర్మాణంలో పాలకుల తీరు మారటం లేదని సీపీఎం నాయకుడు బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేర్లు మారుతున్నాయి తప్ప, పేదలకు ఒరిగిందేమీ లేదని, వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఊరించి మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం రెండు సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల కేటాయింపు హామీ ఇచ్చినా, తొమ్మిది నెలల్లో జరిగింది శూన్యమని ఆరోపించారు.
ఆరేళ్లుగా జక్కంపూడిలో టిడ్కో స్కీం కింద కట్టిన వేలాది ఇళ్ళు వృధాగా పడి ఉన్నాయని, అజిత్ సింగ్ నగర్, కబేళా తదితర ప్రాంతాల్లో JNNURM స్కీంలో నిర్మించిన ఇళ్ళు కేటాయించకుండా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వేలాదిమంది ఇళ్ల కొరకు లబ్ధిదారుల వాటా పేరుతో కోట్లాది రూపాయలు చెల్లించిన వారికి ఇళ్లు రాలేదని, బ్యాంకులు మాత్రం వడ్డీలతో సహా రుణాలు వసూలు చేస్తున్నారని చెప్పారు.
విజయవాడలో దాదాపు పదివేల ఇళ్ళు 72 నెలలుగా వృధాగా పడి ఉండటంతో 216 కోట్ల రూపాయలు పేదలపై అద్దెల భారం పడిందన్నారు. ఇళ్ళు, స్థలాలు, పట్టాలు తదితర ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని సీపీఎం ప్రకటించింది.
సంబంధిత కథనం