AP Cinema Ticket Price : ఏపీలో కూడా సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిని రద్దు చేయాలి : సీపీఐ
AP Cinema Ticket Price : సంక్రాంతి సీజన్ వచ్చింది. ఈ సమయంలో ప్రముఖ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలకు ఏపీ ప్రభుత్వం వెసులుబాట్లు కల్పించింది. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ ఇష్యూపై విమర్శలు వస్తున్నాయి. ధరల పెంపును సీపీఐ ఖండించింది.
ఆంధ్రప్రదేశ్‌లో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ల ధరలు పెంచడాన్ని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600, మల్టీప్లెక్స్ టికెట్‌కు అదనంగా రూ.175, సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్‌కు అదనంగా రూ.135 పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం దుర్మార్గమని విమర్శించారు.
ఏపీలో సినిమా టికెట్ ధరలు పెంపుపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదని.. రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రజల అభిమానాన్ని బలహీనతగా చూడటం తగదని హితవు పలికారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిని రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
గేమ్ ఛేంజర్‌కు ఇలా..
రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు కూటమి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 10న తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్ షో వేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. దీనికి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్ థియేటర్లలో రూ.135 చొప్పున పెంచుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలయ్యే రోజు ఆరు షోలు, 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ రోజుకు 5 షోలు వేసుకోవచ్చని స్పష్టం చేసింది.
డాకు మహారాజుకు ఇలా..
నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపునకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీచేసింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో నిర్వహించేందుకు, ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇలా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకప్పుడు అలా..
తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సినిమా బాగున్నా, బాగోలేకపోయినా ప్రజలు థియేటర్‌కు వచ్చేవారు. టికెట్ ధరలు తక్కువ ఉండటంతోపాటు క్యాంటిన్లలోని ధరలు కూడా అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ కొండెక్కి కూర్చున్నాయి. పెరిగిన ధరలను చూసి అసలు థియేటర్లకు రావడమే మానేశారు. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో సినిమాలకు కాస్త డిమాండ్ ఎక్కువ. ఆదాయం కూడా ఏపీ నుంచే ఎక్కువ వస్తుంది. కాబట్టి.. నిర్మాతలు టికెట్ రేట్లు పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎప్పుడూ కోరుతుంటారు.
జగనే మేలు..
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా టికెట్లు, బెనిఫిట్ షోల విషయంలో కఠినంగా వ్యవహారించారు. ధరల పెంపునకు చాలా సినిమాలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే.. ఇప్పుడు ధరలు పెంచడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. గతంలో జగన్ తీసుకున్న నిర్ణయమే బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.