మద్యం కేసులో పోలీస్ కస్టడీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ!-court permits police custody to chevireddy bhaskar reddy in ap liquor case know more details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మద్యం కేసులో పోలీస్ కస్టడీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ!

మద్యం కేసులో పోలీస్ కస్టడీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ!

Anand Sai HT Telugu

మద్యం కేసు రోజురోజు దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడులను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు చెవిరెడ్డి పీఏలను సిట్ బృందం లిక్కర్ స్కామ్‌లో ఇండోర్‌లో అదుపులో తీసుకుంది.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(ఫైల్ ఫొటో) (@ChevireddyYSRCP)

మద్యం కుంభకోణంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడులను పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. జులై 1 నుంచి 3వ తేదీ వరకు కస్టడీ విధించింది. పోలీసులు వీరిని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేయనున్నారు.

ఇంకోవైపు ఈ కేసులో వేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడును ఇటీవల సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా జులై 1 వరకు రిమాండ్ విధించింది. తాజాగా పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.

మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ వేడిని పెంచుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీఏలు బాలాజీ, నవీన్‌ను సిట్ బృందం అదుపులోకి తీసుకున్నది. ఎలక్షన్ సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దుల్లోకి రూ.8కోట్ల 20 లక్షల రూపాయలు తరలించినట్టుగా బాలాజీపై అభియోగాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఈ డబ్బును ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది.

అయితే తాజాగా బాలాజీ, నవీన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దొరికారు. సిట్ బృందం భయంతోనే అక్కడకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఫోన్ విషయంలో వీరిద్దరు అక్కడున్నట్టుగా దొరికిపోయారు. ఇక్కడ నేతలతో తరచూ సంప్రదింపులు చేశారు. లోకేషన్ ఆధారంగా సిట్ ఇండోర్ వెళ్లింది. సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై అధికారులు చాలా సీరియస్‌గా ఉన్నారు. దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఫోకస్ చేస్తున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.