AP Degree Admissions 2024 : ఏపీలో డిగ్రీ ప్రవేశాలు - జూన్ 18 నుంచి కౌన్సెలింగ్-counseling for degree admissions in ap from june 18 check key dates are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Degree Admissions 2024 : ఏపీలో డిగ్రీ ప్రవేశాలు - జూన్ 18 నుంచి కౌన్సెలింగ్

AP Degree Admissions 2024 : ఏపీలో డిగ్రీ ప్రవేశాలు - జూన్ 18 నుంచి కౌన్సెలింగ్

HT Telugu Desk HT Telugu
Published Jun 02, 2024 09:59 AM IST

AP Online Degree Admission 2024 Updates : ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారైంది.జూన్ 18 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.‌

ఏపీలో డిగ్రీ ప్రవేశాలు 2024
ఏపీలో డిగ్రీ ప్రవేశాలు 2024

AP OAMDC Admissions 2024: ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ జూన్ 18 నుండి ప్రారంభం కానుంది.‌ ఆన్‌లైన్‌లోనే కళాశాలల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. విద్యార్థులు తమకు కావాల్సిన కాలేజీలకు వరసగా ప్రిఫరెన్సీ ఇవ్వడంతో వారికి వచ్చిన మార్కులు బట్టీ కాలేజీలను నిర్ణయిస్తారు. ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా డిగ్రీ ప్రవేశాలు చేస్తారు.

రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ జూన్ 18 నుంచి 29 వరకు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈలోపు యూనివర్శిటీల అనుబంధ గుర్తింపు, ఇతరత్రా ఫీజులు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలల అనుమతుల పొడిగింపు ఫీజును చెల్లించాలని కాలేజీలకు యూనివర్శిటీలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.

ఆలిండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఏఐసీటీఈ) అనుమతి ఉంటేనే బీసీఏ, బీబీఏ కోర్సులను కౌన్సిలింగ్ పెట్టనున్నారు. ఆ తరువాత ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా కౌన్సిలింగ్ చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.‌

ఏఏ కాలేజీల్లో ప్రవేశాలు ?

  • 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
  • రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు జరగనున్నాయి.‌ అయితే బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎఫ్ఏ, బీ. వొకేషనల్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 18 నుంచి 29 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.‌
  • ఆన్‌లైన్ దరఖాస్తు చేసే సమయంలో బీసీ విద్యార్థులు రూ. 300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200, జనరల్ కేటగిరీ (ఓసీ) విద్యార్థులు రూ.400 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
  • ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఓఏఏండీసీ ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ మార్కు షీట్, కుల ధృవీకరణ, ఇతర‌ అవసరమైన పత్రాలు స్కాన్ చేసిన కాపీలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
  • విద్యార్థులు దరఖాస్తు చేయాలనుకుంటున్న కళాశాల కోసం వెబ్ ఎంపికలను చేయాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఏస్సీహెచ్ఈ) ఆన్‌లైన్ మోడ్‌లో సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేస్తుంది. ఎంపికైన విద్యార్థులకు కేటాయించిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి.

మూడు దశల్లో ప్రవేశాలు….

మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మొదట దశలో ప్రవేశాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ లో 80 శాతం - 90 శాతం మధ్య మార్కులు సాధించిన విద్యార్థులకు రెండో దశలో ప్రవేశాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ లో 80 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మూడో మరియు చివరి దశలో ప్రవేశాలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో 3.19 లక్షల సీట్లు ఉండగా, గతేడాది 1.53 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులు ఉన్నాయి. వీటికి గతంలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు వీటిని ఆలిండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ కోర్సులకు ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. అయితే దీనిపై కాలేజీ యాజమాన్యాలు కోర్టులను ఆశ్రయించాయి. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు జూన్ 20కి వాయిదా వేసింది.‌

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు, ఏపీ.

Whats_app_banner