AP Ministers Staff : నీకెంత.. నాకెంత.. ఏపీలో డబ్బులు దండుకుంటున్న మంత్రుల వ్యక్తిగత సిబ్బంది?-corruption allegations against andhra pradesh ministerial staff ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ministers Staff : నీకెంత.. నాకెంత.. ఏపీలో డబ్బులు దండుకుంటున్న మంత్రుల వ్యక్తిగత సిబ్బంది?

AP Ministers Staff : నీకెంత.. నాకెంత.. ఏపీలో డబ్బులు దండుకుంటున్న మంత్రుల వ్యక్తిగత సిబ్బంది?

AP Ministers Staff : ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా.. హోంమంత్రి అనిత పీఏ అక్రమాల వ్యవహారం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తోంది.

మంత్రుల సిబ్బందిపై అవినీతి ఆరోపణలు (istockphoto)

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేషీలో.. అవినీతి దందా చర్చనీయాంశంగా మారింది. మంత్రి అండతో పీఏ జగదీష్‌ అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వచ్చాయి. అతనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన హోంమంత్రి.. జగదీష్‌‌ను తొలగించారు. 10 రోజుల కిందట అతన్ని దూరం పెట్టినట్టు స్వయంగా అనిత ప్రకటించారు.

ఇంటలిజెన్స్ ఫోకస్!

హోంమంత్రి పీఏ జగదీష్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. వైసీపీ, ప్రజలు, సొంత పార్టీ కేడర్ నుంచి విమర్శలు రావడంతో.. ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వద్ద పనిచేసే సిబ్బందిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇంటలిజెన్స్ ద్వారా ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించుకున్నట్టు సమాచారం.

మంత్రుల వార్నింగ్..

ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో.. ఇటు మంత్రులు కూడా అలర్ట్ అయ్యారు. తమ దగ్గర పనిచేసే సిబ్బందికి వార్నింగ్ ఇస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి.. ప్రత్యర్థి పార్టీ నేతలతో కలిసి దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మైనింగ్, ఇసుక దందాలో సదరు మంత్రి, ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిపై విమర్శలు ఉన్నాయి. ఇంటలిజెన్స్ వారిపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.

దందా ఇలా..

మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీల దగ్గర పనిచేసే వ్యక్తిగత సిబ్బంది జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ, అంగన్‌వాడీ పోస్టుల భర్తీ, ఇసుక, మైనింగ్, టీటీడీ సిఫారసు లేఖలు, పోలీస్ కేసులు, లిక్కర్ మాఫియా, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సిబ్బంది నియామకం, కాంట్రాక్టులు, భూదందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

గుర్రుగా కేడర్..

ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేశామని.. అలాంటి తమకు ఏదైనా పని చేయాలంటే.. డబ్బులు అడుగుతున్నారని కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే సిబ్బంది కేర్ చేయడం లేదని, కనీసం కలవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారని నాయకులు గుర్రుగా ఉన్నారు. దీనివల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

కుటుంబ సభ్యుల పెత్తనం..

చాలా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కుమారులు దగ్గరుండి దందాలు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారని, వీరివల్ల పనులు కావడం లేదని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జట్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు వాపోతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి లోకేష్‌కు చాలామంది బాధితులు చెప్పినట్టు టీడీపీ నేత ఒకరు 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు'కు వివరించారు.