Pawan Varahi Vehicle: ప్రచార రథం 'వారాహి' రిజిస్ట్రేషన్ అవుతుందా? రూల్స్ ఏంటి?-controversy on pawan kalyan election campaign vehicle varahi over olive green colour ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Controversy On Pawan Kalyan Election Campaign Vehicle Varahi Over Olive Green Colour

Pawan Varahi Vehicle: ప్రచార రథం 'వారాహి' రిజిస్ట్రేషన్ అవుతుందా? రూల్స్ ఏంటి?

Mahendra Maheshwaram HT Telugu
Dec 09, 2022 02:58 PM IST

Pawan Varahi Vehicle Controversy: త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు సిద్దం అవుతున్నారు. ఇందుకోసం ఓ బస్సును ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. దీనికి 'వారాహి' అని పేరు కూడా పెట్టారు. అయితే బస్సు రంగు మాత్రం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్దమంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బస్సు రిజిస్ట్రేషన్ అవుతుందా..? లేక రంగు మారుతుందా..? అనేది ఆసక్తిగా మారింది.

వారాహి వాహనంతో జనసేన అధినేత పవన్
వారాహి వాహనంతో జనసేన అధినేత పవన్ (twitter)

Janasena Election Campaign Vehicle Varahi: పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం 'వారాహి'పై సరికొత్త వివాదం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా వెహికల్ చుట్టే తెగ చర్చ నడుస్తోంది. ప్రైవేట్ వాహనాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ...రాసుకొస్తున్నారు. ఇలా చేయటం సరికాదని.. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో... వైసీపీ మద్దతుదారులు ఇక రెచ్చిపోతున్నారు. మోటర్ వాహనాల చట్టాలను ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు 'వారాహి'పై ఎందుకీ వివాదం మొదలైంది..? వాహనం రిజిస్ట్రేషన్ అవుతుందా..? లేదా..? రంగు మారటం ఖాయమేనా..? జనసైనికుల వర్షన్ ఏంటనేది చూస్తే......

ట్రెండింగ్ వార్తలు

వారాహిపై వివాదం ఇదే...

వారాహి వాహనం విషయంలో రంగుతోనే వివాదం మొదలైంది.ఈ వాహనం కలర్‌ విషయంలో పలువురు అభ్యంతరాలు చెబుతున్నారు. మిలటరీ కలర్ ఆలివ్ గ్రీన్ వాహనాలు వేరే వారికి అనుమతి ఉండదని రాసుకొస్తున్నారు. ప్రైవేట్ వాహనాలకు మిలటరీ రంగు వేసుకోవటం నిబంధనలకు విరుద్ధం అని చెబుతున్నారు. ఇలాంటి రంగులు వాడటం నిషేధం అని పేర్కొంటున్నారు. దీనిపై రూపొందించిన చట్టాలు, నిబంధనలను కూడా ప్రస్తావిస్తున్నారు. దీంతో వారాహి వాహన రంగు చర్చకు దారి తీసినట్లు అయింది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

ఆలివ్ గ్రీన్ రంగుపై నిబంధనలు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ రంగు వాహనాలను ఆర్మీ అధికారులు మాత్రమే వాడేలా నిబంధనలు రూపొందించారు. ప్రైవేటు వ్యక్తులు వాడటానికి వీల్లేదు. ఆర్మీ విజ్ఞప్తి మేరకు… సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్ లోని సెక్షన్ 121 ప్రకారం ఆలివ్ గ్రీన్ రంగును నిషేధించారు. అయితే ఇందులో కలర్ కోడ్ అనేది చాలా కీలకం. ఆర్మీ కంటూ ప్రత్యేకమైన కలర్ కోడ్(4b5320 Hex Color Code -RGB color model) ఉంటుంది. దీని ప్రకారం ఆ రంగును ఆర్మీ సైన్యం మాత్రమే వాడుతోంది. ఈ రంగును ఇతరులు వాడితే ఆర్మీ ఐడెంటీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నందునే ఇలాంటి నింబధనలను తీసుకొచ్చారు. ఈ మధ్యనే హిమాచల్ ప్రదేశ్ సర్కార్... దాదాపు 15వేల వాహనాలకు ఆలివ్ రంగు విషయంపై నోటీసులు కూడా ఇచ్చింది. ఆయా రంగులను మార్చుకోవాలని స్పష్టం చేసింది.

రిజిస్ట్రేషన్ అవుతుందా..?

వారాహి వాహనం రిజిస్ట్రేషన్ అవుతుందా..?లేదా..? అనే దానిపై చర్చ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే పత్రాల ఆధారంగా రవాణాశాఖ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఆలివ్ గ్రీన్ రంగుకు సంబంధించిన రంగుగా భావిస్తే రిజిస్ట్రేషన్ ఆగిపోయే అవకాశం ఉందని ప్రముఖ న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర్ ఓ విశ్లేషణలో కూడా చెప్పారు. నిజానికి అభ్యంతరం ఉంటే రంగు విషయంలో మరో లేయర్ వేసుకోవాలని అధికారులు సూచించవచ్చని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా రంగు మారవచ్చని అభిప్రాయపడ్డారు.

జనసేన కౌంటర్..

ఈ విమర్శలపై జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా స్పందిస్తున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదని.. ఆలివ్ గ్రీన్ లో అనేక రంగులు ఉంటాయని.. వాటిలో కొన్నిటికి మాత్రమే అనుమతి ఉంటుంది అన్నారు. నిబంధనల గురించి వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా సిద్ధం అవుతోందని ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల చెప్పారు. నిబంధనలు పరిశీలించకుండా, ఏ రంగు వేశారో చూడకుండా రవాణా శాఖ అధికారులు అనుమతి ఎలా ఇస్తారు? అని వ్యాఖ్యానించారు. ఈ విమర్శలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. ముందుగా నా సినిమాలను అడ్డుకున్నారని.. విశాఖ వెళ్తే హోటల్‌ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని రాసుకొచ్చారు. విశాఖ నుంచి బలవంతంగా పంపించేశారన్న పవన్... మంగళగిరిలో కారులో వెళ్తుంటే అడ్డుకున్నారని పేర్కన్నారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న నన్ను ఆపేశారు. ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారు. కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా..? అంటూ ట్వీట్‌ చేశారు. ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా?’’ అని ఆయన వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

ఇక వారాహిలో ప్రత్యేకమైన లైటింగ్, ఆధునిక సౌండ్ సిస్టమ్స్ .ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత భద్రతా చర్యలతో వాహనం రూపొందించారు. పవన్‌కల్యాణ్‌ పర్యటనల సందర్భంగా లైట్లు ఆఫ్ చేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో వాహనంలో ప్రత్యేక లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారాహిలో అన్ని వైపులా సీసీ కెమెరాలు ఉన్నాయి. అది ఎప్పటికప్పుడు సర్వర్‌ రూమ్‌కి వెళుతుంది. ఆధునిక సౌండ్ సిస్టమ్‌తో వేలాది మంది ప్రజలు కూడా పవన్ కల్యాణ్ ప్రసంగాలను స్పష్టంగా వినవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ ఏపీలోనా లేక తెలంగాణలో ఉంటుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంటుంది.

మొత్తంగా పవన్ ప్రచారం రథం 'వారాహి' రంగు వ్యవహరం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది చూడాలి. ఇక ఈ అంశాన్ని వివాదం చేయడం సరికాదని, అధినేత ఏ వాహనంలో వచ్చారనేది జనాలు చూడరని, ఇది పెద్ద ప్రభావితం చేసే అంశం కూడా కాదని అంటున్నారు. మహా అయితే మరితే కొంచెం మార్చుకుంటారేమో అంటూ నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ రవాణాశాఖ అధికారులు ఏం చేస్తారనేది మాత్రం కాస్త ఆసక్తిని పుట్టించేలా కనిపిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం