AP Finance Department: బిల్లుల చెల్లింపులో నిబంధనలకు తిలోదకాలు.. ఏపీలో కాంట్రాక్టర్లు, వెండర్లు, సప్లయర్ల గగ్గోలు
AP Finance Department: ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అస్తవ్యస్థంగా మారిన పాలనా వ్యవస్థను సరిచేసి రాష్ట్రాన్ని గాడిన పెడతారని భావిస్తే అందుకు విరుద్ధంగా వ్యవహారం సాగుతోంది. బిల్లుల చెల్లింపులో అనుసరిస్తున్న విధానాలతో కాంట్రాక్టర్లు, వెండర్లు, సప్లయర్లు గగ్గోలు పెడుతున్నారు.
AP Finance Department: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా వ్యవస్థను గాడిన పెట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. రాష్ట్రం అప్పలు ఊబిలో చిక్కుకుపోయిందని, కనివిని ఎరుగని రీతిలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేమని తరచూ చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం దివాళా తీసే పరిస్థితుల్లో ఉందని అప్పుల లెక్కలు అంతు చిక్కడం లేదని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కూడా చెప్పుకొచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు ఏపీ ఆర్థిక శాఖలో జరుగుతున్న దానికి పొంతన కుదరడం లేదు. కాంట్రాక్టర్లు,వెండర్లు, సప్లయర్లకు ఇప్పటికీ బిల్లుల కోసం ఆర్థిక శాఖ చుక్కలు చూపిస్తోంది. మొదట వచ్చిన బిల్లుల్ని మొదట క్లియర్ చేయాలనే విధానాన్ని పక్కన పడేసి కావాల్సిన బిల్లుల్ని మాత్రమే క్లియర్ చేసే సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయాల్సిన బిల్లులు దాదాపు రూ.20వేల కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇవి కాకుండా ప్రభుత్వం అమోదించాల్సినవి,పరిశీలించాల్సినవి మరో లక్ష కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఈ క్రమంలో గత ఆర్నెల్లుగా బిల్లుల చెల్లింపులో జరుగుతున్న పరిణామాలతో చిన్నాచితకా కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు. ప్రభుత్వ సప్లయర్లు, వెండర్ల కష్టాలు పెరిగిపోయాయి.
బిల్లులు చెల్లింపులో నిబంధనలేవి...
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. బిల్లుల చెల్లింపు, అప్పులు, ఖర్చుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా ఇందుకు భిన్నంగా సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి శాఖలో బిల్లులు చెల్లింపు, ఖర్చులు చేయాలంటే అయా డిపార్ట్‌మెంట్ హెడ్ అకౌంట్ల ద్వారా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ప్రతిఖర్చుకు, పథకానికి వేర్వేరు హెడ్ అకౌంట్స్‌ను ఆర్థిక శాఖ నిర్వహిస్తుంది. ఏ ఖర్చు ఎందుకు చేస్తున్నారనే స్పష్టత ప్రతి శాఖకు ఉంటుంది. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు అయా శాఖలు జవాబుదారీగా ఉండాలి.
ఇటీవల ప్రభుత్వ శాఖల ద్వారా జరిగే చెల్లింపుల్లో ఇటీవల కొత్త సాంప్రదాయం మొదలైనట్టు తెలుస్తోంది. శాఖల వారీగా బిల్లులు చెల్లించడానికి జాబితాలను ఆర్థిక శాఖ కోరడం, అయా శాఖలు తమ హెడ్ అకౌంట్ల ద్వారా చెల్లించాల్సిన బిల్లుల జాబితాలను తయారు చేసి ఆర్థిక శాఖ అమోదానికి పంపడం జరుగుతోంది. నిజానికి ఆర్థిక శాఖకు ప్రత్యేకంగా బిల్లుల జాబితా పంపాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ అమోదం పొందిన బిల్లుల చెల్లింపుకు ఆన్‌లైన్ నమోదు చేసిన తర్వాత దానికి వరుస సంఖ్యను కేటాయిస్తారు.
నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు, వెండర్లు, సప్లయర్లు వారు చేసిన పనులకు సంబంధించి నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా పనులు పూర్తి చేసిన తర్వాత, వస్తు, సేవల్ని అందించిన తర్వాత బిల్లులు పెట్టుకోవచ్చు. దీనిని అయాశాఖలు క్షేత్ర స్థాయిలో నిర్ధారించి అమోదిస్తాయి. ఇదంతా ఆన్‌లైన్‌లో జరిగిపోతుంది. ఏ పనికి ఏ హెడ్ అకౌంట్ నుంచి ఖర్చు చేయాలనే స్పష్టత ప్రతి శాఖకు ఉంటుంది. ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధుల లభ్యత, వాటి వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పడు కటాఫ్ తేదీలకు అనుగుణంగా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది.
ఎప్పుడైతే బిల్లులు చెల్లించాల్సిన జాబితాలను అయా శాఖలు ఆర్థిక శాఖకు పంపడం మొదలైందో అక్కడే అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. లిస్ట్ తయారు చేయడమంటే ఎవరికి బిల్లులు చెల్లించాలనే దానిపై శాఖల జోక్యాన్ని పెంచడడమేననే విమర్శలు ఉన్నాయి. బిల్లులు మంజూరు కావాల్సిన వారు సంబంధిత శాఖల్ని ప్రసన్నం చేసుకుంటేనే వారి పేర్లు జాబితాల్లోకి ఎక్కుతున్నాయి. వరుస క్రమంలో బిల్లులు వస్తాయని ఎదురు చూసే వారికి ఎదురు చూపులు తప్పడం లేదు.గత ప్రభుత్వంలో అత్యవసర విభాగాలైన హెల్త్ , మెడికల్ సర్వీసెస్‌లో బిల్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేసేవారని, ఇప్పుడు ఆ శాఖలో కూడా లిస్ట్ వారీగా చెల్లింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల విజ్ఞప్తి...
ప్రభుత్వ కాంట్రాక్టర్లు, సరఫరాదారులు,విక్రేతలుగా ఉన్న వారికి ఆర్థక శాఖ చెల్లింపుల్లో జరుగుతున్న పరిణామాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవస్థలో బయటి వ్యక్తుల ప్రమేయం, శాఖల వారీగా జరుగుతున్న అవకతవకలతో ఇబ్బందులపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపు వ్యవస్థలో జరిగిన అక్రమాలు నాటి ప్రభుత్వ విశ్వసనీయతను కోల్పోవడానికి, చివరికి అధికారం కోల్పోడానికి కారణమైందని చెబుతున్నారు.ఇప్పుడు కొత్తగా ఎంపిక చేసిన చెల్లింపులతో ప్రస్తుత పరిపాలన పాత విధానాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు.
బిల్లుల చెల్లింపు సమీక్షించాలని డిమాండ్
ప్రభుత్వ విభాగాలు ఫస్ట్-ఇన్-ఫస్ట్-అవుట్ (FIFO) ప్రాతిపదికన చెల్లింపు కోసం జాబితాలను సమర్పించకుండా జాబితాలను ఎంపిక చేసి సమర్పించడం విమర్శలకు కారణమవుతోంది. గత ఆరు నెలలుగా PD ఖాతాలతో, అన్ని శాఖల హెడ్ అకౌంట్లను వారీగా చెల్లింపులను సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
చెల్లింపులు సెలెక్టివ్‌గా చేస్తున్నారా లేదా అనే విషయాన్ని సులువుగా ప్రభుత్వం తెలుసుకోవచ్చని,అధికారంలోకి వచ్చిన తక్కువ వ్యవధిలో రాష్ట్రంలో ఒకే చెల్లింపు అధికారం (PFS)పై ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, "అంతిమంగా, ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రభుత్వ విశ్వసనీయత ప్రమాదంలో పడుతుందని చెబుతున్నారు.
గత ప్రభుత్వ చెల్లింపు వ్యవస్థలో లోపాలు ఉన్నా , అత్యవసర సేవల కోసం FIFO సూత్రాన్ని అనుసరించాయని, నెలవారీ లేదా ద్వైమాసిక ప్రాతిపదికన బిల్లులను వరుస క్రమంలో సాధారణ చెల్లింపులు చేశాయని గుర్తు చేస్తున్నారు.
సంబంధిత కథనం