Pawan Kalyan : రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా పుడిచర్ల గ్రామంలో పంట కుంట నిర్మాణానికి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్ఠం చేస్తున్నామన్నారు. బలమైన, అనుభవజ్ఞులైన చంద్రబాబు...సీఎంగా ఉండబట్టే పల్లె పండుగ విజయవంతం అయ్యిందన్నారు. మే నెలాఖరు లోపు 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
"ఈ రోజు మనం పల్లె పండుగ, జాతీయ ఉపాధి హామీ పథకాల అమలు, రోడ్ల నిర్మాణాలు ఇంత సమర్ధవంతంగా చేస్తున్నాం అంటే దానికి ఇద్దరు కారణం. ఐఏఎస్ అధికారులు శశి భూషణ్, కృష్ణ తేజ, వారికి నా హృదయపూర్వక అభినందనలు. నేను మనుషులని గెలుపు సమయంలో లెక్కించను కానీ కష్ట సమయంలో ఎలా ఉన్నారు అని చూస్తాను. కష్ట సమయంలో మీరు బలంగా నిలబడ్డారు, మమ్మల్ని నిలబెట్టారు. తెగించి రోడ్ల మీదకు నాయకులు వస్తే వెనక మీరు ఉండబట్టే 175కి 164 అసెంబ్లీ సీట్లు, 21 పార్లమెంట్ సీట్లు గెలవగలిగాం. ఇది సామాన్యమైన విజయం కాదు, దేశం తల తిప్పి చూసిన విజయం. మీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్నిచ్చారు, అందుకే ఈ ఘన విజయం ప్రజలది. ముఖ్యంగా యువత, మహిళలది" - పవన్ కల్యాణ్
"ప్రజలు విజయాన్ని ఇచ్చారు కాబట్టి కర్నూలు జిల్లాలో 75 కోట్ల రూపాయలతో 117 కిలోమీటర్లు సీసీ రోడ్ల నిర్మాణం సాధ్యమయ్యింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణం పూర్తి అయింది. దీనికి కలెక్టర్ రంజిత్ బాషాకు నా అభినందనలు. వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ పనిచేయ్యాలని నా విజ్ఞాపన.
గ్రామ పంచాయితీలకు ఇప్పటిదాకా చాలా తక్కువ నిధులు ఇచ్చేవాళ్లు... ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాకా సీఎం చంద్రబాబు...నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం కావొచ్చు, పంచాయితీరాజ్ వ్యవస్థ కావొచ్చు వీటిని పటిష్ఠం చేసేందుకు అవకాశం ఇస్తున్న ఆయన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పల్లె పండుగ విజయవంతం అయింది. బలమైన, అనుభవశీలి అయిన ముఖ్యమంత్రి ఉంటే నాలంటివారు నేర్చుకుంటారు. మనకంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోడానికి నేనెప్పుడూ సంసిద్ధంగా ఉంటాను"- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
"ఈ రోజు మనం రోడ్లు వేశాం అంటే కొద్ది మందే కనిపిస్తారు. కానీ ఇలాంటి లక్షలాది మంది శ్రమ కనిపించదు. పల్లె పండుగలో ప్రథమ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. సీసీ రోడ్ల నిర్మాణంలో కర్నూలు జిల్లా నెం 1. రోడ్లు లేక డోలీ మోతలతో ఇబ్బంది పడే గిరిజన గ్రామాలకు ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 100 మందికి పైగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో సైతం అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నాం. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద గిరిజన గ్రామాల్లో 612 కి.మీ. పైన 239 గ్రామాలకు అనుసంధానం చేస్తూ రహదారి సౌకర్యం కల్పించేందుకు 206 పనులు మంజూరు చేశాం. ఈ అభివృద్ధి పనులకు 555.60 కోట్ల రూపాయలు కేటాయించాం" - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
"గిరిజన గ్రామాల్లో విద్యుత్తు, తాగు నీరు, ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద కొండ ప్రాంతాల్లో 250 మందికి పైగా, సాధారణ ప్రాంతాల్లో 500 మందికి పైగా జనాభా ఉన్న చోట రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు ఇస్తాం " -పవన్ కల్యాణ్
సంబంధిత కథనం