Sri Sathyasai District : హిందూపురంలో గుట్టుగా వ్యభిచార దందా - మహిళా అరెస్ట్, తెరవెనక కానిస్టేబుల్...!
శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురంలో సాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ గృహాన్ని నడుపుతున్న మహిళతో పాటు సహకరించిన కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలో వ్యభిచార కుంపటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన ఓ కానిస్టేబుల్ ఈ దందాలో కీలకంగా వ్యవహరించాడు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార కుంపటిలోకి దింపేవారు. ఈ వ్యవహారాలన్నీ ఓ మహిళా చూసుకునేది. చుట్టుపక్కల వారు హెచ్చరించినా కానిస్టేబుల్ అండతో వాటిని పట్టించుకోలేదు. దీంతో స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దాడి చేసి కానిస్టేబుల్‌తో సహా మహిళను అరెస్టు చేశారు.
తెరవెనక కానిస్టేబుల్…!
ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపురంలో మోడల్ కాలనీలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కానిస్టేబుల్ పురుషోత్తం హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పని చేసేవాడు. ఇటీవలే మడకశిర స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. హిందుపురం పట్టణంలో మోడల్ కాలనీలో భర్తను వదిలేసిన ఓ మహిళ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. ఆమెకు కానిస్టేబుల్ పురుషోత్తంతో పరిచయం ఏర్పడింది.
దీంతో ఆమె వ్యభిచారం గృహం పెట్టాలని నిర్ణయించుకుని కానిస్టేబుల్‌కి చెప్పింది. అందుకు కానిస్టేబుల్ పురుషోత్తం కూడా అంగీకరించాడు. అందులో తనకు సగం వాటా కావాలని అడిగాడు. అందుకు మహిళ కూడా అంగీకరించింది. దీంతో ఆమె ఇంట్లోనే వ్యభిచార కేంద్రాన్ని ప్రారంభించింది. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చే వారు. వారితో వ్యభిచారం గృహాన్ని నిర్వహించేవారు. అయితే స్థానికులు దీనిపై పలుసార్లు హెచ్చరించారు. దీంతో కానిస్టేబుల్ జోక్యం చేసుకుని స్థానికులను బెదిరించేవాడు. వ్యభిచారం ఆగకుండా నిర్వహించేవారు.
పోలీసులకు సమాచారం…
ఆ మహిళలో మార్పు రకపోవడం, కానిస్టేబుల్ జోక్యం చేసుకోవడంతో స్థానికులు విసుగుచెంది పోలీసులకు సమాచారం అందించారు. హిందూపురం టూ టౌన్ సీఐ అబ్దుల్ కరీం సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్‌తో సహా మహిళను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయాన్ని అంగీకరించారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించగా జైలుకు తరలించారు. అయితే ఇదే కేసులో మేళాపురానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ అబ్దుల్ కరీం తెలిపారు.కానిస్టేబుల్ పురుషోత్తం గతంలో గుడిబండ స్టేషన్‌లో పనిచేసేన సమయంలోనూ పలు ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు.
అలాగే పట్టణంలోని మరో కాలనీలోనూ ఎస్.బాబా… అతని భార్య వ్యభిచారం నిర్వహిస్తుండగా ఆ ఇంటిపై దాడి చేశామని సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. అక్కడ కూడా మహిళతో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి అసాంఘిక చర్యలకు ఎవరూ పునుకున్నా ఉపేంక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అబ్దుల్ కరీం స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలపై నిరంతరం నిఘా పెడతామని… అసాంఘిక చర్యలతో సమాజాన్ని కలుషితం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.