రాష్ట్రంలో ఎస్‌జీటీల బదిలీలపై గందరగోళం.. ఆన్‌లైన్‌లో ప్రక్రియ.. ఇబ్బందులు ఇవే!-confusion over transfers of sgt teachers in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రాష్ట్రంలో ఎస్‌జీటీల బదిలీలపై గందరగోళం.. ఆన్‌లైన్‌లో ప్రక్రియ.. ఇబ్బందులు ఇవే!

రాష్ట్రంలో ఎస్‌జీటీల బదిలీలపై గందరగోళం.. ఆన్‌లైన్‌లో ప్రక్రియ.. ఇబ్బందులు ఇవే!

ఎస్‌జీటీల బదిలీలపై గందరగోళం నెలకొంది. ఉన్నతాధికారులు ఆఫ్‌లైన్‌కు అంగీకారించారు. కానీ.. అమలు చేయలేమంటున్నారు జిల్లా అధికారులు. ఆన్‌లైన్‌లో పాఠశాలల వివరాలు, తప్పులు దొర్లుతాయని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయిలో పనిభారం తగ్గించుకునేందుకు అధికారులు సాకులు చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎస్‌జీటీల బదిలీలపై గందరగోళం (unsplash)

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి బుధవారం ప్రభుత్వం జీవో 22ను విడుదల చేసి ప్రక్రియను ప్రారంభించింది. తొలుత ప్రధానోపాధ్యాయులు తమ వివరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వారికి బదిలీలు చేపట్టనున్నారు. అయితే.. ఎస్‌జీటీలకు ఆఫ్‌లైన్‌లో బదిలీలు చేపడతామని పాఠశాల విద్య ఉన్నతాధికారులు.. ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల సమయంలో అంగీకారం తెలిపారు. ఎస్‌జీటీలకు కొంత సౌలభ్యం లభించిందని అందరూ భావించారు.

జీవోలో మాత్రం..

కానీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో మాత్రం.. అన్నివర్గాల ఉపాధ్యాయులకు ఎస్‌జీటీలతో సహా ఆన్‌లైన్‌లో బదిలీలు చేపడతామని తెలియజేయడంతో గందరగోళం నెలకొంది. చర్చల సందర్బంగా ఆఫ్‌లైన్‌ అని చెప్పి, జీవోలో ఆన్‌లైన్‌లో బదిలీలు చేపడతామని చెప్పడం ఏంటని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. జీవోలో సవరణలు చేయాలని లేదా జిల్లా అధికారులకు బదిలీల విషయమై ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు.

జిల్లాల్లో సాధ్యం కాదు..

బదిలీల జీవోతో సంబంధం లేకుండా పాఠశాల ఉన్నతాధికారులు.. జిల్లా స్థాయి డీఈవోలకు ఆఫ్‌లైన్‌ బదిలీలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. అయితే.. తాము ఆఫ్‌లైన్‌ విధానంలో బదిలీలు చేపట్టలేమని ఉపాధ్యాయ సంఘాలకు, టీచర్లకు డీఈవోలు చెబుతున్నారు. తమ వద్ద ఆఫ్‌లైన్‌లో బదిలీలు చేపట్టే వనరులు, సమయం లేవని.. పనిభారం ఉంటుందని జిల్లా అధికారులు చెబుతున్నారని తెలిసింది. ఆన్‌లైన్‌ బదిలీల వల్ల తాము నష్టపోతామని ఎస్‌జీటీలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు మరోసారి జోక్యం చేసుకుని ఇచ్చిన మాట ప్రకారం ఆఫ్‌లైన్‌లో బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కోరుతోంది.

ఇవే ఇబ్బందులు..

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల మంది ఎస్‌జీటీలు ఈ ఏడాది బదిలీల లిస్టులో ఉన్నారు. వీరందరూ ఐచ్చికాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో ఐచ్చికాలు ఎంపిక చేసుకోవడం కష్టతరంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఆన్‌లైన్‌ విధానం అలవాటు లేకపోవడం, కంప్యూటర్‌ నాలెడ్జి లేకపోవడం వల్ల ఆప్షన్స్‌ ఎంపిక చేసుకునే క్రమంలో తప్పులు నమోదు చేస్తే.. దూరంగా పోస్టింగ్‌ వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ విధానంలో వందల సంఖ్యలో ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి వస్తుందని, ఈ విధానం వల్ల కనీసం ఆయా మండలాల్లో పాఠశాలల స్థితిగతులు కూడా తెలియవని అంటున్నారు.

అప్పుడే పొరపాట్లు..

2015 మధ్య కాలంలో ఆన్‌లైన్‌ విధానంలో ఆప్షన్లు ఎంపిక చేసుకుని.. అక్కడ పొరపాట్లు చేయడం వల్ల అనేక మంది ఉపాధ్యాయులు నష్టపోయారు. ఆ సమయంలో ధర్నాలు కూడా జరిగాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆఫ్‌లైన్‌లో బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యలయంలో జరిగే ఆఫ్‌లైన్‌ బదిలీల ప్రక్రియ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్‌జీటీలు అభిప్రాయపడుతున్నారు.

ఆఫ్‌లైన్‌లో అయితే..

ఆఫ్‌లైన్‌లో అయితే.. ఉపాధ్యాయుడికి వచ్చిన పాయింట్ల ఆధారంగా మండలాల్లోని పాఠశాలలు కనిపిస్తాయి. అక్కడి పాఠశాల వివరాలు తెలసుకుని ఐచ్చికాలు ఎంపిక చేసుకుంటే.. ఎక్కడికి బదిలీ అవుతుందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతోపాటు అప్పటికే పోస్టులు క్లోజ్‌ అయిన పాఠశాలల వివరాలు డిస్‌ప్లే కావడం వల్ల కొత్త పాఠశాలలను ఎంపిక చేసుకునే వీలుంటుంది. ఐచ్చికాలు ఎంపిక సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. తప్పులు చేసే అవకాశం ఉండదని ఎస్‌జీటీ టీచర్లు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనం