AP EAPCET 2024: ముగిసిన ఏపీ ఈఏపీ సెట్, 93.47శాతం హాజరు, నేడు కీ విడుదల, 26వరకు ఆన్‌లైన్ విండో ఓపెన్…
AP EAPCET 2024: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2024 ప్రశాంతంగా ముగిశాయి. ఏపీ, తెలంగాణల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో 93.47శాతం మంది విద్యార్ధులు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో పరీక్షలకు హాజరయ్యారు. నేడు ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష ప్రాథమిక కీను విడుదల చేయనున్నారు.
AP EAPCET 2024 : ఏపీ ఈఏపీ సెట్ 2024 ప్రశాతంగా ముగిశాయి. మే 18 నుంచి 23వరకు ఏపీ ఈఏపీ సెట్‌ను కాకినాడ జేఎన్‌టియూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 93.47శాతం మంది విద్యార్ధులు బైపీసీ, ఎంపీసీతో పాటు రెండు స్ట్రీమ్‌లకు జరిగిన పరీక్షలకు హాజరైనట్టు కన్వీనర్ వెల్లడించారు. ఏపీలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్‌ను నిర్వహించారు.
ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి అన్ని సెషన్లలో కలిపి 2,74,213 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,58,373 మంది పరీక్షకు హాజరయ్యారు. 15840మంది గైర్హాజరు అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 94.22 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
అగ్రికల్చర్ & ఫార్మశీ విభాగానికి సంబంధించి అన్ని సెషన్లకు 88,638 మంది ఈఏపీ సెట్‌కు విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రి, ఫార్మసీ విభాగాల్లో 7872మంది గైర్హాజరయ్యారు. ఈ విభాగంలో 91.12 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఈఏపీ సెట్ 2024కు మొత్తంగా 3,62,851 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. 23712మంది గైర్హాజరు కావడంతో 93.47 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్ ప్రొ.కె. వెంకటరెడ్డి తెలిపారు.
ఇంటర్ మార్కులకు వెయిటేజీ…
ఏపి ఈఏపీ సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి 25% వెయిటేజీ మార్కులను ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు కాకుండా ఇతర బోర్డులకు చెందిన 10+2 విద్యార్థులు తమ మార్కులను ఏపీ ఈఏపీ సెట్ వెబ్సైట్ ద్వారా అప్ లోడ్ చేయవలసి ఉంటుంది, ఇంటర్ మార్కుల్ని అప్‌లోడ్ చేసిన తర్వాతే వారికి ర్యాంకులు కేటాయిస్తారని కన్వీనర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా 0884-2359599, 0884-2342499 ఫోన్ నెంబర్లలో గాని, helpdeskapeapcet@apsche.org మెయిల్ ఐడి ద్వారా గాని సంప్రదించాలన్నారు.
నేడు ఇంనీరింగ్ విభాగం కీ విడుదల…
ఏపీలో ఎటా ఈఏపీ సెట్‌కు హాజరయ్యే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కన్వీనర్ తెలిపారు. దరఖాస్తులతో పాటు పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఏపీ ఈఏపీ సెట్ పరీక్షకు అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో ఈఏపీ సెట్ ప్రవేశ పరీక్షలో హాజరు శాతం కూడా గణనీయంగా పెరిగింది.
అగ్రికల్చర్ & ఫార్మశీ విభాగానికి సంబంధించి గురువారం ఉదయం ప్రాధమిక 'కీ'ను విడుదల చేశారు. దీంతో పాటు రెస్పాన్స్ షీట్స్ వెబ్సైట్లో పొందుపర్చారు. ఈనెల 25వ తేదీ ఉదయం 10గంటల వరకు ప్రాధమిక 'కీ'పై విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని కన్వీనర్ తెలిపారు.
ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి శుక్రవారం ఉదయం 10గంటలకు ప్రాధమిక 'కీ'సు విడుదల చేస్తారు. దీంతో పాటు రెస్పాన్స్ షీట్స్ వెబ్సైట్లోఅందుబాటులో ఉంటాయి. ఈనెల 26వ తేదీ ఉదయం 10గంటల వరకు ప్రాధమిక 'కీ'పై విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని కన్వీనర్ ప్రొ. కె. వెంకటరెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత కథనం