AP Tourism : పర్యాటకులకు అలర్ట్.. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త!-complaint to police against fake websites related to ap tourism ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tourism : పర్యాటకులకు అలర్ట్.. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త!

AP Tourism : పర్యాటకులకు అలర్ట్.. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త!

Basani Shiva Kumar HT Telugu
Jan 17, 2025 02:02 PM IST

AP Tourism : ఏపీలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూడటానికి పర్యాటకులు వస్తారు. వసతి కోసం సెర్చ్ చేసి.. రూమ్‌లను బుక్ చేసుకుంటారు. అయితే.. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి టూరిస్టులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పర్యాటక శాఖ అలర్ట్ అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త
నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త

ఏపీలో ఇటీవల నకిలీ వెబ్‌సైట్ల ద్వారా గదులు బుక్‌ చేసుకుని.. మోసపోతున్న పర్యాటకుల పెరుగుతోంది. దీనిపై టూరిజం అధికారులు ఫోకస్ పెట్టారు. ఆ వెబ్‌సైట్లను నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా.. డీజీపీకి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ లేఖ రాసింది.

yearly horoscope entry point

నకిలీ వెబ్‌సైట్లు..

ఏపీకి వచ్చే పర్యాటకులు తాము సందర్శించే ప్రాంతాల్లో వసతి కోసం టూరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన హోటళ్లు, రిసార్టుల గదుల్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటారు. పలు సందర్బాల్లో రూమ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇదే అదునుగా భావించి సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లలో గదుల బుకింగ్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తున్నారు. వీటి ద్వారా బుక్‌ చేసుకుంటున్న వారు మోసపోతున్నారు.

వెలుగులోకి మోసాలు..

ముఖ్యంగా బాపట్ల సమీపంలోని సూర్యలంక, శ్రీశైలంలో గదుల బుకింగ్‌కు సంబంధించిన మోసాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌ తదితర దూర ప్రాంతాల నుంచి ఇటీవల కొందరు సూర్యలంక బీచ్‌కు వెళదామని ప్లాన్ చేసుకున్నారు. అక్కడి పర్యాటక శాఖ రిసార్ట్‌లోని కాటేజీలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. వారు బుక్‌చేసుకుంది నకిలీ వెబ్‌సైట్‌ అని తెలియక వేల రూపాయలు నష్టపోయారు.

రూ.30 వేలు చెల్లించాక..

ఒక్కొక్కరు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.30 వేలు చెల్లించారు. ఇద్దరూ సూర్యలంకలోని పర్యాటక శాఖ బీచ్‌ రిసార్ట్‌కు వెళ్లారు. అక్కడ తాము గదులు బుక్‌ చేసుకున్నట్లు ఫోన్లో వచ్చిన మెసేజ్‌లను రిసార్ట్‌ మేనేజర్‌‌కు చూపించారు. అయితే.. పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో మీ పేర్లతో ఎలాంటి గదులు బుక్‌ కాలేదని ఆయన వారికి చెప్పారు.

15 రోజుల కిందట కూడా..

దీంతో తాము మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పర్యాటకులకు అధికారులు సూచించారు. 15 రోజుల కిందట కూడా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇదే తరహాలో మోసపోయాడు. సూర్యలంక బీచ్‌ రిసార్ట్‌లో గది కోసం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే క్రమంలో నకిలీ వెబ్‌సైట్‌ బారినపడి రూ.7,800 పోగొట్టుకున్నారు. వీటన్నింటిపై పర్యాటక శాఖ ఫోకస్ పెట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అధికారిక సైట్ ద్వారానే..

మోసాలు జరుగుతున్న నేపథ్యంలో.. టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారులు పర్యాటకులకు సూచనలు చేశారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లు, రిసార్టుల్లో గదులు, ఇతర టూర్‌ ప్యాకేజీల బుకింగ్‌ కోసం ప్రత్యేకంగా https://tourism.ap.gov.in వెబ్‌సైట్‌ అందుబాటులో ఉందని వివరించారు. దీని ద్వారానే బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Whats_app_banner