Karimnagar Collector: టీచర్ గా మారి పాఠాలు చెప్పిన కరీంనగర్ కలెక్టర్... వైద్య శిబిరంలో వైద్యులకే పరీక్షలు
Karimnagar Collector: కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి టీచర్ గా మారారు.పిల్లలకు పాఠాలు చెప్పారు. అంతేకాదు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాన్ని సందర్శించి స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వైద్య సిబ్బంది చేసే పరీక్షలకే కలెక్టర్ టెస్ట్ పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
Karimnagar Collector: కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి రూటే సపరేట్ అన్నట్లుగా ఉంది. వినూత్న ప్రోగ్రాములు చేపట్టి ప్రజలతో మేకం ఆవుతున్నారు. ఇప్పటికే ప్రతి శుక్రవారం మహిళలు పిల్లలతో శుక్రవారం సభ నిర్వహిస్తూ ఆరోగ్య సూత్రాలు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు తల్లుల ఆరోగ్యం సంక్షేమంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
పాఠాలు చెప్పిన కలెక్టర్...
తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. ఆరవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని బోధించారు. పిల్లలతో మమేకమై వారిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిలబస్ గురించిన ప్రశ్నలు వేస్తూ జవాబులు రాబట్టారు.
8వ తరగతి విద్యార్థులను సైన్స్ గురించిన ప్రశ్నలను అడిగారు. విద్యార్థులు సరైన జవాబులు ఇవ్వడంతో ఉపాధ్యాయుల బోధన పట్ల సంతృప్తి చెందారు. నల్లగొండ ప్రభుత్వ పాఠశాలలో బోధన బాగుందని ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని, ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులను ఒప్పించాలని సూచించారు.
ఆరోగ్య మహిళ ను సద్వినియోగం చేసుకోవాలి..
మహిళలు పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపే కలెక్టర్, గ్రామైక్య సంఘాల సభ్యులు ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కోరారు. తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామ పంచాయితీ ఆవరణలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ క్యాంప్ ను కలెక్టర్ సందర్శించి వైద్యాధికారులకు పరీక్ష పెట్టారు. వైద్యులు వైద్య సిబ్బంది చేసే వైద్య పరీక్షల్లో ఫర్ఫెక్ట్ గా రిజల్ట్ వస్తుందా?... సక్రమంగా పరికరాలూ పనిచేస్తున్నయా లేదా అని టెస్ట్ చేశారు.
కలెక్టర్ స్వయంగా రక్త పరీక్షలు చేయించుకున్నారు.హిమోగ్లోబిన్ షుగర్, బిపి టెస్టులు చేసుకుని అన్నీ నార్మల్ గా రావడంతో సిబ్బందిపై పరికరాలపై ఉన్న అపోహను తొలగించుకున్నారు. మహిళలకు 45 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామంలోని ప్రతి మహిళకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు జరగాలని, ఆ దిశగా గ్రామ సంఘాల సభ్యులు అవగాహన తీసుకురావాలని కోరారు.
అంగన్వాడీ కేంద్రం సందర్శన..
ముక్తపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించి పిల్లలకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు. అంగన్వాడికి పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. గృహ సందర్శనలు చేసి తల్లిదండ్రులకు అంగన్వాడి సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీ, బాలింతలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో టీచర్లు గానీ వైద్య సిబ్బంది కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)