తగ్గేదేలే.. నేతల అండతో కోడి పందాలు.. చేతులు మారింది రూ. 300 కోట్ల పైమాటే
ఆంధ్ర ప్రదేశ్‌లో నిన్న భోగి రోజున జరిగిన కోడి పందాలలో సుమారు రూ. 300 కోట్లకు పైగా చేతులు మారినట్టు అంచనా. నేతల అండదండలు, పోలీసుల ప్రేక్షక పాత్రతో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. నేతల అండ ఉండగా మనల్ని ఎవరు ఆపేది అంటూ ఉత్సాహంతో కోడి పండేలు నిర్వహించారు. కోడి పందేలను ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతలే ప్రారంభించారు. దీంతో కోడి పందేలపై ఆంక్షలు పటాపంచలు అయిపోయాయి. ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పేరుమోసిన రాజకీయ నేతలే రంగంలోకి దిగడంతో పోలీసు, అధికార యంత్రాంగం ప్రేక్షపాత్ర పోషించింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, చిత్తూరు వంటి జిల్లాల్లో కోడి పందేలు జరిగాయి. ఏకంగా తొలిరోజు రూ. 300 కోట్లకు పైగా చేతులు మారినట్టు అంచనా. అయితే ఇందులో సింహా భాగం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలదే.
హైకోర్టు ఆంక్షలు ఉన్నా
కోడి పందాలు నిర్వహించకూడదని హైకోర్టు ఆంక్షలు ఉన్నాయి. జిల్లాల ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు ఈమేరకు హడావుడి చేశారు. కోడి పందేలు, గుండాట వంటి జూద క్రీడలకు అనుమతి లేదని, వాటిని తక్షణమే ఆపాలని హెచ్చరికలు జారీ చేశారు. ఆ రకంగా మండల స్థాయిలో సీఐ, ఎస్ఐలు, ఎమ్మార్వోలు గ్రామాల్లో పర్యటించి హడావుడి చేశారు.
పోలీసు శాఖ నుంచి సీఐ, ఎస్ఐలు అయితే ఒక అడుగు ముందుకేసి, కోడి పందేలు కోసం ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశారు. ఈసారి కోడి పందేలు, గుండాట వంటి జూద క్రీడలు ఉండవన్నట్లు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. అయితే ఏం జరిగింది? మళ్లీ యథేచ్ఛగా కోడి పందేలు, గుండాట వంటి జూద క్రీడలు గతం కంటే భారీ స్థాయిలో జరిగాయి. భోగి పండుగకు రెండు రోజుల వరకు హడావుడి చేసిన పోలీసు, అధికార యంత్రాంగం భోగి ముందు రోజు నుంచి వదిలేశారు.
ప్రారంభించిన నేతలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జి సత్యన్నారాయణ మూర్తి, పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, మామిడికుదురు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు రంగంలోకి దిగి కోడి పందాలు ప్రారంభించారు.
అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు, ఏలూరు ఎంపీ మహేష్ కుమార్, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తణుకులో వైసీపీ వేసిన బరులను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్య నటుడు కృష్ణ భగవాన్ పోటీలను ఆసక్తిగా తిలకించారు.
రూ . 300 కోట్ల పైమాటే
కోడి పందేలే కాదు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో భారీ స్థాయిలో నిర్వహించారు. మూడు రోజుల పండుగలో తొలిరోజే సుమారు రూ. 300 కోట్ల మేరకు పందెం రాయుళ్లు పందాలు కాసినట్టు అంచనా. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ. 100 కోట్లకు పైబడి చేతులు మారినట్టు అంచనా. భీమవరం, ఉండి మండలాల్లో భారీ స్థాయిలో కోడి పందేలు జరిగాయి. పెదమిరం, సీసలి, అయిభీమవరం, తాడేరు, కలగంపూడి, గొల్లవానితిప్ప, తాడేపల్లిగూడెంలో పెద్ద పెద్ద బరులను నిర్వహించారు. ఒక్కో పందేం రూ.25 లక్షల వరకు జరిగింది. కొన్ని చోట్ల లక్షల్లో ఎంట్రీ ఫీజు వసూలు చేశారు. అంటే నిర్ణీత మొత్తం జమచేస్తేనే కోడి పందాలకు ఎంట్రీ ఉంటుంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పందేల జాతర ఘనంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలో 1,140 బరుల్లో కోడి పందేలు జరిగాయి. తొలి రోజు కోడిపందేలు, గుండాట, కోతాటతో కలిపి రూ. 175 కోట్లకుపైగా పందాలు సాగినట్టు అంచనా. బరులు ఏర్పాటు చేసిన చోట టెంట్లు వేశారు. విందు, వినోదాల మధ్య వీక్షకులు కేరింతలు కొట్టారు.
తూర్పుగోదావరి జిల్లాలో 300, కాకినాడ జిల్లాలో 410, కోనసీమ జిల్లాలో 430 బరుల్లో కోడి పందేలు జరిగాయి. రంపచోడవరం వంటి ప్రాంతాల్లో కోడిపందేల బరులు ఉన్న చోటు కూల్‌డ్రిక్స్ అమ్మిన మాదిరి మద్యం సీసాలు కూడా బహిరంగానే పెట్టి అమ్మకాలు నిర్వహించారు.
కడప జిల్లా పులివెందులలో కూడా కోడి పందేలు జరిగాయి. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి బరుల వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జరిగాయి. కృష్ణా జిల్లాలో కోడి పందేలు విచ్చలవిడిగా సాగాయి. గుంటూరు జిల్లాలో కూడా కోడి పందేలు జోరుగా సాగాయి. కాగా కోడి పందాల్లో పాల్గొనేందుకు, వీక్షించేందుకు తెలంగాణ సహా పలు పొరుగు రాష్ట్రాల నుంచి తెలుగు వారు భారీగా తరలివచ్చారు.
- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు