Vande Bharat Express : విశాఖపట్నం- దుర్గ్ వందేభారత్‌కు కోచ్‌లు తగ్గింపు.. ఆదరణ లేకపోవడంతో ఈ నిర్ణయం!
Vande Bharat Express : విశాఖ- దుర్గ్ వందేభారత్ రైలుకు కోచ్‌లను తగ్గించారు. ఆదరణ తక్కువగా ఉండటంతో కోచ్‌లు తగ్గించినట్లు అధికారులు ప్రకటించారు. సగానికి కోచ్‌లను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం- దుర్గ్ వందేభారత్ రైలుకు 16 కోచ్‌లు ఉండగా.. ఇప్పుడు 8 కోచ్‌లే ఉండనున్నాయి.
రైలు నంబర్ 20829 దుర్గ్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మొత్తం 16 కోచ్‌లు ఉండేవి. కానీ జనవరి 24 నుండి 8 కోచ్‌లతో నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. అలాగే రైలు నంబర్ 20830 విశాఖపట్నం- దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా సగం కోచ్‌లు తగ్గించనున్నారు. ఈ రెండు రైళ్లలో ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్, ఏడు చైర్ కార్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రజలు మార్పులను గమనించి, తదనుగుణంగా వ్యవహరించాలని రైల్వే అభ్యర్థించింది.
మార్పులు.. చేర్పులు..
ప్రయాణికుల ఆదరణకు అనుగణంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అధికారులు మార్పులు, చేర్పులు చేశారు. ఆదరణ ఎక్కువ ఉన్న రైళ్లకు కోచ్‌లు సంఖ్య పెంచడం, తక్కువ ఉన్న రైళ్లకు కోచ్‌లు సంఖ్య తగ్గించడం చేస్తున్నారు. ఇటీవలి విశాఖపట్నం- సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ఆ రైళ్లకు కోచ్‌ల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం ఉన్న 16 కోచ్‌లను 20కి పెంచారు. విశాఖపట్నం- భువనేశ్వర్ మధ్య నడిచే వందేభారత్ రైలుకు 8 కోచ్‌లే ఉన్నాయి.
డిమాండ్ తక్కువ..
డిమాండ్ తక్కువ ఉన్న విశాఖపట్నం- దుర్గ్ వందేభారత్ రైళ్లకు కోచ్‌లు తగ్గించారు. విశాఖపట్నం- దుర్గ్ వందేభారత్‌ను 2024 సెప్టెంబర్ 16న ప్రారంభించారు. దీనికే 40 నుంచి 45 శాతమే ఆక్యుపెన్సీ ఉంటుంది. అలాగే దుర్గ్- విశాఖపట్నం (20829) వందేభారత్ రైలుకు రాయగడ వరకు 50 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంటుంది. అక్కడ నుంచి విశాఖపట్నానికి కేవలం 20 నుంచి 25 శాతమే ఆక్యుపెన్సీ ఉంటుంది. దీంతో ఖాళీ సీట్లతో రైలు ప్రయాణిస్తోంది.
రేట్లు ఎక్కువ..
విశాఖపట్నం నుంచి పార్వతీపురం వరకు సాధారణ రైళ్లలో టికెట్ ధర కేవలం రూ.145 ఉంటుంది. కానీ వందేభారత్‌కు రూ.565 ఉంది. దాంతో రాయగడ నుంచి విశాఖపట్నం వరకూ ఈ రైలు ఎక్కేవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కోచ్‌లను తగ్గించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఒక్కో చైర్ కోచ్‌లో 70 సీట్లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌లో 40 సీట్లు ఉంటాయి.
నాలుగు రైళ్లకు అదనపు కోచ్‌లు..
1. రైలు నంబర్ 12376 జాసిదిహ్ - తాంబరం ఎక్స్‌ప్రెస్‌కు ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌ను పెంచారు.
2. రైలు నంబర్ 12375 తాంబరం - తాంబరం ఎక్స్‌ప్రెస్‌కు ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌ను పెంచారు.
3. రైలు నంబర్ 12835 హటియా- ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌కు రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు పెంచారు.
4. రైలు నంబర్ 12836 ఎస్ఎంవీ బెంగళూరు- హటియా ఎక్స్‌ప్రెస్‌కు రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు పెంచారు.
నాలుగు రైళ్లకు తాత్కాలికంగా..
1. రైలు నెంబర్ 22604 విల్లుపురం - ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 18 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను పెంచారు.
2. రైలు నెంబర్ 22603 ఖరగ్‌పూర్ - విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 20 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను పెంచారు.
3. రైలు నెంబర్ 22606 తిరునల్వేలి - పురులియా ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 19 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను పెంచారు.
4. రైలు నెంబర్ 22605 పురులియా - తిరునల్వేలి ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 21 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను పెంచారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)