AP Assembly: అప్పులు తక్కువే... ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదు - సీఎం జగన్-cm ys jagan statement on debts of andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Ys Jagan Statement On Debts Of Andhra Pradesh

AP Assembly: అప్పులు తక్కువే... ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదు - సీఎం జగన్

HT Telugu Desk HT Telugu
Sep 16, 2022 03:44 PM IST

cm jagan on ap debts: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉందన్నారు ఏపీ సీఎం జగన్. రెండోరోజు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. గడిచిన మూడేళ్లలో చూస్తే కేంద్ర ప్రభుత్వ అప్పులు పెరిగాయని వ్యాఖ్యానించారు. వాటితో పోల్చితే ఏపీ అప్పులు తక్కువే అని చెప్పారు.

సీఎం జగన్ (ఫైల్ ఫొటో)
సీఎం జగన్ (ఫైల్ ఫొటో) (twitter)

CM YS Jagan in Assembly 2022: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం...గతంలోనే చంద్రబాబు సర్కారే ఎక్కువ అప్పులు చేసిందని విమర్శించారు. వారితో పోల్చితే తమ ప్రభుత్వం తక్కువ అప్పులు చేసిందని...సంక్షేమ పథకాలను ఎక్కువ చేపట్టిందని వివరించారు. కావాలనే ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందని... వీటిని ప్రజలంతా గమనించాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు

ఇవాళ పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై జరిగిన చర్చలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. కొవిడ్ సహా ఎన్నో సవాళ్లు ఎదురైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందన్నారు. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని... రాష్ట్రం బాగున్నా ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర జీడీపీ పెరుగుదల గతంలో కంటే బాగుందని స్పష్టం చేశారు. 2018-19లో జీడీపీ 5.36 ఉంటే ఇప్పుడు 6.89 శాతంగా ఉందని చెప్పుకొచ్చారు. దేశంలో జీడీపీ పరంగా ఆరోస్థానానికి చేరుకున్నామని ప్రకటించారు.

తమ ప్రభుత్వం ప్రతి పనిని పారదర్శకతతో చేస్తుందని చెప్పారు సీఎం జగన్. జరుగుతున్న మంచిని ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వంలో బడ్జెటే ఇవాళ కూడా దాదాపు అదే ఉందన్నారు. అయినప్పటికీ ఇవాళ అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. విభజన నాటికి రాష్ట్ర రుణాలు రూ.1.26 లక్షల కోట్లుగా ఉంటే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 2.69 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 123.52% అప్పులు పెరిగాయని... ఈ మూడేళ్లలో రాష్ట్ర రుణాలు 3.82 లక్షల కోట్లకు పెరిగాయని వివరించారు. ఈ మూడేళ్లలో రాష్ట్ర రుణాలు 41.4 శాతం పెరిగాయన్న ఆయన.. కేంద్రంతో పోలిస్తే ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తగ్గిందని అన్నారు.

సీఎం జగన్ ప్రసంగం తర్వాత సభను స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు. తిరిగి సోమవారం సభ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం