Mobile Towers in AP : గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు - ఏపీలో కొత్తగా 300 సెల్‌ టవర్స్‌ ప్రారంభం-cm ys jagan launched 300 4g mobile towers in tribal areas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mobile Towers In Ap : గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు - ఏపీలో కొత్తగా 300 సెల్‌ టవర్స్‌ ప్రారంభం

Mobile Towers in AP : గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు - ఏపీలో కొత్తగా 300 సెల్‌ టవర్స్‌ ప్రారంభం

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 25, 2024 08:05 PM IST

CM Jagan Launches Mobile Towers: ఏపీలోని పలు మారుమూల గిరిజన ప్రాంతాల్లో కొత్తగా 300 సెల్ టవర్లు ప్రారంభయ్యాయి. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ సేవలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.

సీఎం జగన్
సీఎం జగన్

CM Jagan Launches Mobile Towers : మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్స్‌ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్. ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లను ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44 టవర్లు ఉండగా… ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ ఉన్నాయి. ఈ టవర్ల ఏర్పాటు ద్వారా 944 ఆవాసాలకు, 2 లక్షల మంది ప్రజలకు సేవలు అందనున్నాయి.

ఈ సేవల ప్రారంభం సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్…. ఇవాళ దేవుడిదయతో మరో మంచి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. గతంలో జూన్‌లో 100 టవర్లు ఇదేమాదిరిగా ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. “ఈరోజు మరో 300 టవర్లు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కడైతే పూర్తిగా కనెక్టివిటీ లేని పరిస్థితి ఉందో, ఫోన్లలో మాట్లాడడానికి కూడా అనుకూలించని పరిస్థితులు ఉన్న గ్రామాల్లో ప్రారంభించుకుంటున్నాం” అని అన్నారు.

“సంక్షేమపథకాలు ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లాలి. పారదర్శకంగా ఆ సంక్షేమ పథకాలన్ని ప్రతి ఇంటికి అందాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ 400 టవర్లును దాదాపుగా రూ.400 కోట్ల పెట్టుబడితో నిర్మించుకున్నాం. ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ 300 టవర్లతో… 2లక్షల మంది జనాభాకు ప్రయోజనం కలిగనుంది. 944 గ్రామాలు వీటి ద్వారా కనెక్ట్‌ అవుతున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన 100 టవర్లతో 42వేల జనాభాకు ప్రయోజనం కలిగింది. చేరుకోవాల్సిన మార్గం ఇంకా ఉంది. దాదాపుగా ఇంకా మనం మరో 2,400 టవర్లును రానున్న నెలల్లో వేగంగా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 2900 టవర్లును ఏర్పాటు చేయడం ద్వారా... కనెక్టివిటీలేని 5,459 ఆవాసాలను కనెక్టివిటీలోకి తీసుకొచ్చే బృహత్తర ప్రణాళిక ఇది. సుమారు రూ.3119 కోట్లతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించాం. దీన్ని సఫలీకృతం చేసేందుకు కేంద్రంతో మాట్లాడి.. ఇందులో భాగస్వామ్యం చేసేందుకు ఒప్పించాం. టవర్ల నిర్మాణం దిశగా అడుగులు వేగంగా వేయగలిగాం. టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూములను 2,900 లొకేషన్లలో ఇప్పటికే ఇచ్చాం” అని గుర్తు చేశారు ముఖ్యమంత్రి జగన్.

ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి జగన్. “టవర్ల ఏర్పాటు కోసం పవర్‌ కనెక్షన్‌కు అనుమతులు కూడా ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినవన్నీ కూడా రెట్టించిన వేగంతో చేశాం. 2,900 టవర్ల నిర్మాణ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఈ దఫా 300, గతంలో 100 మొత్తం 400 టవర్లు ఏర్పాటు పూర్తయింది. ఇక మిగిలిన టవర్ల నిర్మాణానికి అడుగుల వేగంగా పడుతున్నాయి. దేవుడు ఆశీర్వదిస్తే ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలకొకసారి... 400 నుంచి 500 టవర్ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తూ... మరో ఏడాది కాలంలో అన్ని టవర్ల నిర్మాణం దేవుడిదయతో పూర్తి చేస్తాం” అని చెప్పారు.

టీ20 వరల్డ్ కప్ 2024