Flood Compensation: అందరికీ వరద సాయం అందాల్సిందేనంటున్న సీఎం… అధికారులు తీరుతోనే అసలు సమస్య
Flood Compensation: వరద సాయం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు ఆచరణలో జరిగే దానికి పొంతన కుదరడం లేదు.చివరి బాధితుడి వరకు వరద సాయం అందించాల్సిందేనని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా అధికారులు ఎన్యుమరేషన్‌లో చేసిన పొరపాట్లను ఇప్పటికీ సరిదిద్దుకోలేక పరిహారం చెల్లింపులో విఫలం అవుతున్నారు.
Flood Compensation: వరద సాయం చెల్లింపు విషయంలో భారీగా పరిహారం ఇస్తున్నా ప్రభుత్వానికి మంచి పేరు మాత్రం దక్కడం లేదు. వరద సాయం అంచనాలు రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యానికి మొత్తంగా కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. వరద సాయం విడుదలై వారమవుతున్నా ఇప్పటికీ బాధితులకు పరిహారం జమ కాకపోవడంతో సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
వరద నష్టం అంచనాలను రూపొందించే సమయంలో చేసిన పొరపాట్లు, ఉద్యోగుల నిర్లక్ష్యానికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. నష్టం వివరాలను నమోదు చేసే క్రమంలో పరిహారం ఏ బ్యాంకు ఖాతాకు చెల్లించాలనే దానిపై స్పష్టత తీసుకోకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిసిస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆధార్ బేస్డ్ చెల్లింపులు చేపట్టాలని నిర్ణయించినా దాని అమలులో ఉండే సమస్యలను ముందుగా అంచనా వేయలేక పోయారు.
దీంతో వేలాదిమందికి నేటికి పరిహారం అందలేదు. మరోవైపు పరిహారం చెల్లింపులో ముఖ్యమంత్రిని కొందరు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బాధితుల చెల్లింపుల వివరాలు రెండో రోజే అందుబాటులోకి వస్తాయని చెప్పినా నేటికి అవి సచివాలయాలకు చేరలేదు.
నాలుగో తేదీ డెడ్‌లైన్
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులకు అందించాల్సిన రూ.602 కోట్ల పరిహారం పంపిణీలో రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు వివరించారు.
ఇందులో రైతులకు పంట నష్టపరిహారం కింద జరిపే చెల్లింపులు రూ.301 కోట్లు కాగా...మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం బాధితుల అకౌంట్లకు నగదు డీబీటీ పద్ధతిలో అందించగా.....అందులో 97 శాతం మంది లబ్ధిదారుల అకౌంట్లకు పరిహారం జమ అయ్యిందని అధికారులు వివరించారు. 22,185 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ అవ్వలేదని అధికారులు వివరించారు.
బ్యాంక్ అంకౌట్ తో ఆధార్ లింక్ అవ్వకపోవడం, ఆధార్ అకౌంట్ మ్యాచ్ అవ్వకపోవడం, అకౌంట్ యాక్టివ్ గా లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, అకౌంట్ తప్పుగా నమోదు అవ్వడం, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లలో జమకాలేదని అధికారులు వివరించారు.
ఈ నేపథ్యంలో లబ్ధిదారులు బ్యాంక్ కు వెళ్లి కెవైసీ పూర్తి చేసుకోవాలని కోరామని...రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. బ్యాంకు అకౌంట్లకు మరో సారి డబ్బులు బదిలీ చేశామని.. సాకేంతిక సమస్య పరిష్కరించుకున్న వారి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని వివరించారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికీ పరిహారం అందజేయాలని...ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులకు సిఎం సూచించారు.
అర్హులెవరికీ సాయం అందకుండా ఉండేందుకు అవకాశం ఉండకూడదు అని సిఎం స్పష్టం చేశారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని...వాటిని పరిశీలించి అర్హత ఉంటే ప్రభుత్వ నుండి సాయం అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. అర్హులుగా ఎంపికై ఎవరికైతే డబ్బులు వారి అకౌంట్లలో పడలేదో.....వారు సచివాలయ సిబ్బంది ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ప్రజలను కోరుతున్నామని అధికారులు తెలిపారు.
కుటుంబం యూనిట్‌గా ఆర్థిక సాయం జమ
రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రభావిత బాధితులకు కుటుంబం యూనిట్‌గా ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని, కుటుంబంలో ఒకరిని గుర్తించి, వారి ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో డీబీటీ ద్వారా నగదు జమ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు.
కుటుంబంలో మరో వ్యక్తిని లబ్ధిదారునిగా గుర్తించడానికి వీలు లేని విషయాన్ని గుర్తించాలని, అనవసరంగా అర్జీలు దాఖలు చేయొద్దని సూచించారు. బాధితులకు అత్యంత పారదర్శకంగా సహాయం అందించడం జరుగుతోందని, ఇప్పటివరకు ఇళ్ళు, వాహనాలు తదితర నష్టాలకు సంబంధించి 1,12,481 మంది బ్యాంకు ఖాతాల్లో సాయం జమచేయడం జరిగిందన్నారు.