CBN in Delhi: విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు 100శాతం సాయం అందించాలని కేంద్రానికి సీఎం వినతి-cm requests center to provide 100 percent assistance for visakhapatnam and vijayawada metro projects ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn In Delhi: విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు 100శాతం సాయం అందించాలని కేంద్రానికి సీఎం వినతి

CBN in Delhi: విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు 100శాతం సాయం అందించాలని కేంద్రానికి సీఎం వినతి

Sarath Chandra.B HT Telugu

CBN in Delhi: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు 100శాతం నిధులు అందించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి కీలకమైన ప్రాజెక్టులను ఆమోదించి, ఆర్థిక సాయం అందించాలని కోరారు.

కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు

CBN in Delhi: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రమంత్రితో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవని వివరించారు.

విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి, ఆర్థిక సాయం అందించాలని కోరారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోట్ ను కేంద్రమంత్రికి సమర్పించారు.

రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు ఆమోదించారు. విశాఖపట్నం, విజయవాడ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని సిఎం తెలిపారు. కీలక పారిశ్రామిక కేంద్రమైన విశాఖపట్నంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తికానుందున, అప్పట్లోగా మెట్రో కారిడార్‌ను జాతీయ రహదారులతో అనుసంధానించడం చాలా ముఖ్యమన్నారు. మొదటి దశలో ప్రధాన పట్టణ కేంద్రాలను అనుసంధానించడం లక్ష్యం. తర్వాత విమానాశ్రయం వరకు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.

రాజధాని అమరావతికి గేట్ వే గా విజయవాడ మెట్రో వ్యవస్థ ఏర్పాటుతో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. విజయవాడ పరిసరాల్లో ఆర్థిక వృద్ధికి తోడ్పడటానికి ఇది చాలా అవసరం. నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యమైనదిగా పరిగణించాలని ముఖ్యమంత్రి కోరారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోందని మెట్రో ప్రాజెక్టులను స్వతహాగా నిర్మించే పరిస్థితుల్లో లేదని రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు 100% కేంద్ర సహాయాన్ని అందించాల్సిందిగా సిఎం కోరారు.

సకాలంలో ప్రాజెక్టును గ్రౌండ్ చేసేందుకు ఫేజ్- 1 అనుమతులు, భూసేకరణకు కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఈ ప్రాజెక్టులు వల్ల వాయు కాలుష్యం తగ్గడమేగాక, ట్రాఫిక్ సమస్య పరిష్కారమై దీర్ఘకాలిక ఆర్థికవృద్ధికి దోహద పడుతుందని కేంద్రమంత్రి ఖట్టర్ కు సిఎం చంద్రబాబు వివరించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం