Jagananna Housing: మంచి చేసే అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటానన్న సిఎం జగన్-cm jagan said that he is indebted for giving him the opportunity to do good ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagananna Housing: మంచి చేసే అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటానన్న సిఎం జగన్

Jagananna Housing: మంచి చేసే అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటానన్న సిఎం జగన్

Sarath chandra.B HT Telugu
Oct 12, 2023 01:33 PM IST

Jagananna Housing: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మంచి చేసే అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటానని సిఎం జగన్ చెప్పారు. మనసున్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండటం, పేదలపై అభిమానం, బాధ్యత ఉండటం వల్లే ఇది సంక్షఏమం సాధ్యమైందని చెప్పారు.

సామర్లకోట గృహ‍ప్రవేశాల కార్యక్రమంలో సిఎం జగన్
సామర్లకోట గృహ‍ప్రవేశాల కార్యక్రమంలో సిఎం జగన్

Jagananna Housing: రాష్ట్రంలో ప్రతి పేదింటి మహిళకు శాశ్వత చిరునామా ఉండటమనే విలువ తెలిసిన మనిషిగా, ప్రభుత్వంగా , పాదయాత్రలో చూసిన ప్రతి కష్టానికి పరిష్కారం చూపుతూ పాలన సాగిస్తున్నట్లు సిఎం జగన్ చెప్పారు. పేదలకు మంచి చేసే అవకాశం తనకు ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉంటానన్నారు.

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజక వర్గం సామర్లకోటలో జరిగిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దేశంలో, రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 31లక్షల కుటుంబాలకు, రాష్ట్ర జనాభాలో 20శాతం పైచిలుకు ఇళ్లు లేని నిరుపేదలకు వారి ముఖంలో సంతోషం చూడాలని తపన తాపత్రయంతో మంచి చేయాలనే ఉద్దేశంతో 31లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగినట్టు చెప్పారు.

ఏడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి….

రాష్ట్రంలో 31లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన వెంటనే 22లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 13వేల పంచాయితీలు ఉంటే నేడు 17వేల వైఎస్సార్ జగనన్న కాలనీలు వస్తున్నాయన్నారు. ఆ కాలనీల్లో కడుతున్న ఇళ్లు చూసి, ఇళ్లు కాదు ఊళ్లు అని చెప్పడానికి గర్వ పడుతున్నట్లు చెప్పారు. ఇంత భారీగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, వాటిలో 22లక్షల ఇళ్లను నిర్మాణంలోకి తెచ్చి, నేటికి 7.43లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అందరి సంతోషం మధ్య గృహ ప్రవేశాలు చేస్తున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు.

7.43లక్షల ఇళ్లలో తమ ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో 5.85లక్షలు ఉన్నాయని, మరో 1,57,566 టిడ్కో ఇళ్లు ఉన్నాయని మొత్తం 7.43లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. ప్రజల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. పేదలకు మంచి చేసే అవకాశం తనకు ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉంటానన్నారు.

సామర్లకోట ఇళ్ల స్థలాల లేఔట్లలో వైఎస్సార్ విగ్రహం ప్రారంభించినపుడు, ఎమ్మెల్యేను ఇంటి స్థలం ఎంతని అడిగితే, ఈ లే ఔట్‌లో 12లక్షల ధర పలుకుతుందని చెప్పారన్నారు. ఇన్ని లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చినందుకు గర్వంగా ఉందన్నారు.

54ఎకరాల్లో 2412 ఇళ్ల స్థలాలు ఇచ్చి వెయ్యి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని వివరించారు. ఇళ్ల పట్టాలతో పాటు నవరత్నాల్లోని ఏ పథకాన్ని తీసుకున్నా డిబిటి, నాన్‌ డిబిటి పథకాల్లో ఏదైనా ఇదే ప్రేమ, బాధ్యతతో అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అమ్మఒడి, ఆసరా చేయూత, సున్న వడ్డీ, పెన్షన్లు, రైతు భరోసా ఏ కార్యక్రమమైనా.. రాష్ట్రంలో అమలవుతున్న 35కు పైగా కార్యక్రమాల్లో పేదలు జీవితాలను మార్చాలనే తపన, తాపత్రయంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

బాధ్యతగా సొంతింటి కల నెరవేరుస్తున్నాం…

గత ప్రభుత్వం ఏనాడైనా పేదల మీద ప్రేమ బాధ్యత చూపించాయా అని జగన్ ప్రశ్నించారు. తాను అధికారంలోకి వచ్చే నాటికి 31లక్షల కుటుంబాలకు సొంత ఇల్లు లేని కుటుంబాలుగా మిగిలిపోయారన్నారు.

అదే ప్రభుత్వం, అదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారితే 31లక్షల పేదల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు వారిపేరుతో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని అందించిందని చెప్పారు. ‎

రుషులు, మునులు, దేవతలు మంచి కోసం యజ్ఞం చేస్తుంటే వాటిని భగ్నం చేయడానికి కుట్రలు చేసే వారని, పేదలకు మంచి చేయాలనే ప్రయత్నం చేస్తుంటే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, ఇళ్ల నిర్మాణం చేయకూడదని కోర్టుల్లో కేసులు వేసి ఆపాలని ప్రయత్నించారన్నారు.

పేదలకు 31లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అడుగులు వేస్తున్నపుడు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయని చెప్పారు. చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్న సమయంలో రెండేళ్లు కోవిడ్‌ వచ్చిందని చెప్పారు. రాష్ట్రానికి వనరులు తగ్గి, రాష్ట్రానికి పెట్టాల్సిన ఖర్చు కోవిడ్‌కు పెట్టాల్సి వచ్చినా సాకులు, కారణాలు చెప్పలేదని, కిందామీద పడి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడ్డానికి తపనతో అడుగులు వేసినట్లు చెప్పారు.

22లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్న సమయంలో ఆ సంతోషాన్ని పంచుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అక్కచెల్లెమ్మకు ఎప్పుడు రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్రంలో 72వేల ఎకరాలను సేకరించి 32.70లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టు చెప్పారు.

ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల మార్కెట్ విలువ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉందని, ఒక్కో ఇంటి స్థలం విలువ రెండున్నర లక్షల మందికి 12-15లక్షల వరకు ఉందన్నారు. రెండున్న లక్షల విలువ లెక్కలో చూసినా వాటి విలువ రూ.75వేల కోట్ల ఉంటుందని చెప్పారు. ఇంత అదృష్టాన్ని ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉంటానని జగన్ చెప్పారు.

రాష్ట్రంలో 21.76లక్షల ఇళ్లను వేగంగా నిర్మిస్తున్నామని, ఒక్కో ఇంటికి రూ.2.70లక్షల ఖర్చు అవుతోందని చెప్పారు.ఇళ్ల నిర్మాణంతో డ్రైనేజీ, కరెంటు, రోడ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.32వేలు అదనంగా ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. పేదల ఇంటి కల నెరవేర్చడానికి గతంలో జరగనిది ఇప్పుడు జరగడానికి ముఖ్యమంత్రి మారడమే కారణమన్నారు. వచ్చే ఎన్నికల్లో దొరబాబును గెలిపించాలని స్థానిక ప్రజలకు సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

WhatsApp channel