CM Jagan: వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సిఎం జగన్-cm jagan released the funds of ysr la nestham at tadepalli camp office ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan: వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సిఎం జగన్

CM Jagan: వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సిఎం జగన్

HT Telugu Desk HT Telugu
Published Jun 26, 2023 01:35 PM IST

CM Jagan: యువ న్యాయవాదులు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వైఎస్ఆర్ లా నేస్తం నిధులను సిఎం జగన్ విడుదల చేశారు. లబ్దిదారుల ఖాతాలకు నిధులు జమ చేశారు. అర్హులైన 2,677 మంది జూనియర్ న్యాయవాదులకు లబ్ధి చేకూరుతోందని సిఎం చెప్పారు.

వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సిఎం జగన్
వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సిఎం జగన్

CM Jagan: రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5000 స్టైఫండ్‌ చొప్పున ఫిబ్రవరి 2023 – జూన్‌ 2023 మధ్య ైదు నెలలకు ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున మొత్తం రూ. 6,12,65,000ను క్యాంపు కార్యాలయం నుంచి ఖాతాలకు జమ చేశారు.

గత నాలుగు ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ ఏడాదికి సంబంధించి ఈ దఫా దాదాపుా 2,677 మంది అడ్వకేట్‌ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు మంచి చేస్తూ రూ.6,12,65,000 వారి అకౌంట్ల్‌ జమ చేస్తున్నట్లు సిఎం జగన్ చెప్పారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు తోడుగా ఉండేందుకు లా నేస్తం కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.

న్యాయవాదులు లా కోర్సు పూర్తిచేసిన, మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంటుందని, అప్పుడే చదువులు పూర్తి అయి, కోర్టుల్లో అడుగుపెడుతున్న పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నామని చెప్పారు.

మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80లక్షలు ఇస్తున్నామని, దీనివల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారని చెప్పారు.ఇబ్బంది పడకుండా జీవితంలో ముందుకు వెళ్తారు అన్న ఆలోచనతో ఈ పథకం ప్రారంభించినట్లు చెప్పారు.

4 ఏళ్లలో 5,781 మందికి రూ.41.52 కోట్లు సాయం చేశామని వివరించారు. ఇప్పటి వరకూ 5,781 మంది జూనియర్‌ న్యాయవాదులకి మేలు చేశామని, 2019 నవంబరులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నాలుగేళ్లలో ప్రతి నెలా రూ.5వేల చొప్పున ఇస్తూ.. ఇంతవరకూ మొత్తంగా రూ. 41.52 కోట్లు జూనియర్‌ లాయర్లకు ఇచ్చామన్నారు.

యువ న్యాయవాదులకు ఆర్ధిక సాయం చేసే ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని, ఇదొక్కటే కాకుండా అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును ఏర్పాటు చేశామని చెప్పారు.

మెడిక్లెయిం, న్యాయవాదుల అవసరాలకు రుణాలు వంటి వాటికి, ఈ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లు సహాయం చేశామన్నారు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా నాలుగేళ్ల కాలంలో అడ్వకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తోడుగా ఉందనే సంకేతం వెళ్లిందన్నారు. ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని, ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటేనని జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరికీ దీనివల్ల మంచి జరిగితే, వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం వీళ్లు పేదలపట్ల చూపిస్తారని ఒక విశ్వాసమన్నారు.

ప్రభుత్వం తరపు నుంచి ఒక అన్నగా, స్నేహితుడిగా వారి దగ్గరనుంచి నేను ఆశిస్తున్నది ఇదేనని జగన్ చెప్పారు. దేవుడి దయ వల్ల మంచి జరుగుతుందని, దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరారు. ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేటట్టుగా గుర్తుపెట్టుకోవాలని అకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి డిసెంబరు నాటికి ఆరునెలలు అవుతుందని, 6 నెలలకు ఒకేసారి మొత్తంగా రూ.30వేలు వస్తే, ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో క్రితం సారి మార్పు చేశామన్నారు. డిసెంబరులో ఈ ఏడాదికి సంబంధించిన రెండో దఫా కార్యక్రమం జరుగుతుందన్నారు. వీటన్నింటివల్లా న్యాయవాదులకు మంచి జరగాలని కోరుకుంటున్నానని సిఎం పేర్కొన్నారు.

Whats_app_banner