CM Jagan Review : 3 నెలల్లో ఏపీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారాలి : సీఎం జగన్-cm jagan orders officials to make ap drugs free state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Jagan Orders Officials To Make Ap Drugs Free State

CM Jagan Review : 3 నెలల్లో ఏపీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారాలి : సీఎం జగన్

HT Telugu Desk HT Telugu
Dec 19, 2022 07:41 PM IST

CM Jagan Review : ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎస్ఈబీ టోల్ ఫ్రీ నంబర్ ను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ (facebook)

CM Jagan Review : వచ్చే 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారాలని... ఎక్కడా మాదక ద్రవ్యాల వినియోగం ఉండొద్దని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఆ లక్ష్యంతోనే పోలీసు, ఎక్సైజ్ శాఖలు పనిచేయాలని ఆదేశించారు. ప్రతి యూనివర్సిటీ, కాలేజీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి... మాదక ద్రవ్యాల ద్వారా కలిగే దుష్పరిణామాలు, వచ్చే ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల వద్ద హోర్డింగ్ లు ఏర్పాటు చేసి.. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) టోల్ ఫ్రీ నెంబర్ - 14500 ను ప్రచారం చేయాలని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్... ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలని... వారంలో ఒకరోజు తప్పనిసరిగా సమావేశం కావాలని స్పష్టం చేశారు. వారంలో మరో రోజు పోలీస్‌ శాఖలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని.. ఇక నుంచి రెగ్యులర్‌గా ఈ కార్యక్రమాలు జరగాలని సీఎం జగన్ నిర్దేశించారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలో ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలని.. సాగు చేసే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి.. ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ ద్వారా వారిలో మార్పు తీసుకురావాలని... వ్యవసాయం, పాడి వంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని సూచించారు. సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం.. దిశ చట్టం - యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడటంపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దిశ యాప్‌ వినియోగం, కాల్స్, వేగంగా స్పందించడం వంటి వాటిపై అన్ని చోట్లా మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది మహిళా పోలీస్‌లు ఉన్నారని.. దిశ చట్టం ఇంకా బాగా అమలు చేయాలని... యాప్‌ డౌన్‌లోడ్స్‌ పెరగాలని అధికారులకి స్పష్టం చేశారు.

అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, బహిరంగ మద్య పానం, ఇసుక ఎక్కువ ధరకు అమ్మడం వంటి వాటిపై ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎస్‌ఈబీ అధికారులు స్పందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. లోకల్‌ ఇంటలిజెన్స్‌ను విస్తృతంగా వినియోగించాలని చెప్పారు. జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు 2.82 లక్షల ఎకరాలకు సంబంధించిన ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామన్న సీఎం.... ఆ భూముల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి, హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌ భార్గవ, ప్రొహిబిషన్‌–ఎక్సైజ్‌ కమిషనర్‌ వివేక్‌యాదవ్, అడిషనల్‌ డీజీపీ రవిశంకర్, ఎస్‌ఈబీ డైరెక్టర్‌ రమేష్‌రెడ్డితో పాటు, పలువురు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

IPL_Entry_Point