Ambedkar Statue in AP : ఆకాశమంత 'అంబేడ్కర్' - విజయవాడలో అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్-cm jagan mohan unveild 125 foot bronze statue of dr b r ambedkar in vijayawada city ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ambedkar Statue In Ap : ఆకాశమంత 'అంబేడ్కర్' - విజయవాడలో అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

Ambedkar Statue in AP : ఆకాశమంత 'అంబేడ్కర్' - విజయవాడలో అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Jan 19, 2024 06:47 PM IST

Ambedkar Statue in Vijayawada: విజయవాడ వేదికగా ఏర్పాటు చేసిన దేశంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో అందర్నీ ఆకట్టుకుంది.

అంబేడ్కర్ విగ్రహం
అంబేడ్కర్ విగ్రహం (YSRCP Twitter)

Ambedkar Statue in Vijayawada: దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏపీ సీఎం జగన్. విజయవాడ వేదికగా నిర్మించిన 210 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆందర్నీ ఆకట్టుకుంది.

విగ్రహా ప్రత్యేకతలు

-విజయవాడ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం నిలువనుంది. 85 అడుగల పీఠంపై నిర్మించిన విగ్రహం మొత్తం 210 అడుగుల ఎత్తున నగరం నలుదిక్కులా కనిపించనుంది.

-అంబేడ్కర్‌ విగ్రహంతో ఇకపై బెజవాడకు ప్రత్యేక గుర్తింపు లభించ నుంది. 'సామాజిక న్యాయ మహా శిల్పం'గా అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని సందర్శనీయ స్థలంగా తీర్చిదిద్దారు.

-ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది. దీని కోసం 18ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని ఆ శాఖకు బదలాయించారు. స్మృతి వనం నిర్మాణాన్ని AP ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టారు.

-హైదరాబాద్‌కు చెందిన KPC ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విగ్రహ నిర్మాణం చేపట్టింది. నోయిడాలోని డిజైన్‌ అసోసియేట్స్‌ డిజైన్లను తయారు చేసింది. రూ.170కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.404.35 కోట్లకు చేరింది.

-విగ్రహ నిర్మాణం జరిగే ప్రదేశం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని దృష్టిలో ఉంచుకుని, నగరం మధ్యలో ఉన్న స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం చేపట్టారు. సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడిచేందుకు వీలుగా చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు నిర్మించారు.

-85 అడుగుల ఎత్తులో నిర్మించిన రెండంతస్తుల కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటాలకు వేదికైన స్వరాజ్య మైదానాన్ని ఇకపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌గా పరిగణిస్తారు.

-స్మృతి వనంలో DR BR అంబేద్కర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, 2వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాటర్‌బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్, లాంగ్ వాక్‌ వేస్‌తో డిజైన్ అసోసియేట్స్ తీర్చిదిద్దింది.

-విగ్రహాన్ని గత ఏడాది ఏప్రిల్ 14 నాటికి ఆవిష్కరించాలనే ఉద్దేశ్యంతో 2021 డిసెంబర్ 21న ప్రాజెక్టును ప్రారంభించారు. విగ్రహం మొత్తం పూర్తిగా భారత దేశంలోనే తయారు చేశారు.

-విగ్రహాన్ని స్టీల్ ఫ్రేమింగ్‌తో మీద కాంస్యంతో తయారు చేసిన క్లాడింగ్‌తో తయారు చేశారు. దీనిన పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారు. విగ్రహం తయారీ కోసం 400 మెట్రిక్‌ టన్నుల స్టెయిన్‌లెస్ స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వినియోగించారు.

-బౌద్ధ వాస్తుశిల్పం యొక్క కాలచక్ర మహా మండలంగా పీఠాన్ని రూపుదిద్దారు. విగ్రహం పీఠం G+2 ఐసోసెల్స్ ట్రాపెజియం ఆకారంలో ఆర్‌సిసి ఫ్రేమ్డ్ నిర్మాణంగా చేపట్టారు.

-భవనం పునాదులు విగ్రహ బరువు తట్టుకునేలా పైల్ ఫౌండేషన్‌తో 30మీటర్ల పైల్స్‌పై నిర్మించారు. షీర్ వాల్‌ గోడలు మరియు 50డిగ్రీల వంపుతో వంపు తిరిగిన RCC స్లాబ్‌లు, బీమ్‌లతో మొత్తం 539 పైల్స్‌ మీద ప్రధాన విగ్రహాన్ని నిలిపారు.

-విగ్రహ పీఠం ఉన్న పెడెస్టల్ బిల్డింగ్ మొత్తాన్ని రాజస్థాన్ నుండి తెచ్చిన పింక్ ఇసుకరాయితో తాపడం చేశారు.

-స్మారక చిహ్నం ముందుభాగంలో 6 నీటి కొలనుల్ని ఏర్పాటు చేవారు. సెంటర్ మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

-కాలచక్ర మహా మండప భవనం లోపల విగ్రహం క్రింద అంబేడ్కర్‌ జీవిత విశేషాలు తెలిపే కేంద్రం అభివృద్ధి చేశారు. మ్యూజియం కోసం ప్రదర్శనలు సిద్ధం చేశారు. మల్టీ-లేయర్డ్ గ్రాఫిక్స్, లేయర్డ్ గ్రాఫిక్స్ విత్ ఎంబెడెడ్ డిస్‌ప్లేలతో చూసే వారిని కట్టి పడేయనుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత కథతో లోతుగా కనెక్ట్ అవ్వడానికి, స్ఫూర్తిని పొందగలిగేలా తీర్చదిద్దారు.

-భవనం బేస్‌మెంట్‌తో పాటు జి+1తో నిర్మించారు. 6340 చదరపు మీటర్ల ప్లింత్ ఏరియాలో ఒకేసారి 2000 మంది సభ్యులు కూర్చునేలా రూపొందించారు. స్మృతి వనంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. రెండు వైపులా వాహనాల పార్కింగ్‌కు వీలు కల్పించారు. ఒకేసారి 95 నాలుగు చక్రాల వాహనాలు, 84 ద్విచక్ర వాహనాలు నిలుపుకోవచ్చు.

-500-600 మంది కార్మికులు ప్రాజెక్టు సైట్‌లో నిరంతరం పనిచేశారు. 55 మంది టెక్నికల్, సపోర్టింగ్ ఉద్యోగులు రేయింబవళ్లు రెండేళ్ల పాటు పనిచేశారు. అంబేడ్కర్‌ స్మృతి వనం కోసం వినియోగించిన వస్తువులన్నీ దేశంలోనే తయారు చేశారు.

Whats_app_banner