Ysrcp Review Time : “గడప గడపకు మన ప్రభుత్వం”పై సీఎం సమీక్ష
ఓ వైపు ప్రతిపక్షాలు చెలరేగిపోతున్నాయి, ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. మిగిలిన పక్షాలు కూడా అదే దారిలో ఉన్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో మాత్రం ఆశించిన ఉత్సాహం రావడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.
పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చిన ఉత్సాహం ఇప్పుడా పార్టీ శ్రేణుల్లో ఏ మాత్రం కనిపించడం లేదు. ఓ వైపు చేసిన మంచిపనుల్ని ఇంటింటికి తిరిగి వివరించాలని ముఖ్యమంత్రి చెబుతున్నా పార్టీ శ్రేణుల్లో చురుకు పుట్టడం లేదు. సంక్షేమ కార్యక్రమాలే కొండంత బలమని వైఎస్సార్సీపీ అధినాయకత్వం విశ్వసిస్తున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని చేపట్టి రోజులు గడుస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు.
ట్రెండింగ్ వార్తలు
ఇంటెలిజెన్స్ నివేదికలు, పార్టీ నివేదికలు అంతా బాగుందని చెబుతున్నా, ఆ పార్టీ నేతలు మాత్రం లోలోన మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై స్వయంగా సమీక్షించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, నియోజక వర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో మనసు విప్పి మాట్లాడాలని నిర్ణయించారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన గడపగడపకూ కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే రకరకాల నివేదికలు తెప్పించుకున్న ముఖ్యమంత్రి, కార్యక్రమం ప్రారంభమైన నెలరోజుల తర్వాత తొలి సమీక్ష నిర్వహించబోతున్నారు. గడపగడపకూ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఎదురవుతున్న సవాళ్లు, ప్రజల విజ్ఞప్తులు, సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సూచనలు, సలహాలను స్వీకరించనున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా బదిలీ చేయడం ద్వారా దాదాపు రూ.1.43 లక్షల కోట్ల రుపాయల్ని నేరుగా ఖాతాలకు జమ చేసింది. వీటితో పాటు మౌలిక సదుపాయల అభివృద్ధికి పెద్ద పీట వేసింది. విద్యా, వైద్యం,రోడ్లు, రవాణా సదుపాయలపై దృష్టిపెట్టిన విషయాన్ని ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయితే పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలపై ప్రజల నుంచి నిరసనలు తప్పడం లేదు.
టాపిక్