YCP Govt : ఏపీ మంత్రి వర్గంలో మార్పులు, అమ్మో 3 తారీఖు అంటున్న వైసీపీ నేతలు! -cm jagan meets ysrcp mlas party leaders on april 3rd discuss about cabinet ministers change ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Jagan Meets Ysrcp Mlas Party Leaders On April 3rd Discuss About Cabinet Ministers Change

YCP Govt : ఏపీ మంత్రి వర్గంలో మార్పులు, అమ్మో 3 తారీఖు అంటున్న వైసీపీ నేతలు!

HT Telugu Desk HT Telugu
Apr 01, 2023 10:12 AM IST

Ysrcp Govt : ఏపీ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మంత్రి సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని ఇప్పటికే సీఎంవో అధికారులతో భేటీ అయ్యారని సమాచారం.

ఏపీ కేబినెట్ లో మార్పులు....!
ఏపీ కేబినెట్ లో మార్పులు....!

Ysrcp Govt : పనితీరు మార్చుకోకపోతే మంత్రి వర్గంలో మార్పులుంటాయని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తన కేబినెట్ కు హెచ్చరికలు జారీచేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరపరాభావం, టీడీపీ బలం పుంజుకుంటుందన్న సంకేతాలు వస్తున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం మరింత దూకుడు పెంచింది. ముందుగా ఉత్తరాంధ్రపై దృష్టిపెట్టిన సీఎం జగన్.. అక్కడి ఇద్దరి నేతలకు నిన్న సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. మంత్రి సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని ఒకరి తర్వాత ఒకరు సీఎంవో అధికారులతో భేటీ అయ్యారు. మంత్రి వర్గం నుంచి సీదిరిని తప్పించి స్పీకర్ తమ్మినేనికి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎంవో పిలుపుతో హడావుడిగా విజయవాడ వచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజు... సీఎంవో అధికారులతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. అనంతం మాట్లాడిన ఆయన మంత్రి వర్గంలో లేకపోయినా నేను మంత్రినే అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఆయనను కేబినెట్ నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే స్పీకర్ తమ్మినేని కూడా పిలుపు రావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారం సాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

నేతల్లో టెన్షన్…!

అయితే ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేత‌ల‌ు ఈ స‌మావేశంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జరుగుతున్న స‌మావేశం కావ‌డంతో పార్టీ నేత‌ల్లో టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్సీ ఫలితాలు ఆశించిన రీతిలో రాకపోవడంతో సీఎం జగన్ సీరియస్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు 'జ‌గ‌న‌న్నే మా భ‌విష్యత్తు' క్యాంపెయిన్ పై కేడర్ కు ఈ సమావేశంలో దిశా నిర్ధేశం చేయ‌నున్నారు సీఎం. ఎమ్మెల్యేల ప‌నితీరు, గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్యక్రమంపై సీఎం స‌మీక్షించ‌నున్నారు. మంత్రి వర్గ మార్పులు పైనా కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అనుకోని ప‌రిస్థితి ఎదుర‌వ్వడంతో తాజా స‌మావేశం హాట్ హాట్ గా జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇప్పటికే ప‌నితీరు మార్చుకోని మంత్రులలో కొంతమందిని మార్చేస్తాన‌ని సీఎం జగన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. నివేదిక‌ల ఆధారంగా సీఎం జగన్ ఎలాంటి కీల‌క ప్రక‌ట‌న చేస్తారని వైసీపీ నేత‌లు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు టెన్షన్ ప‌డుతున్నారు.

వ‌చ్చే సోమవారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు తాడేపల్లి క్యాంప్ కార్యాల‌యంలో సీఎం జగన్ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఫిబ్రవ‌రి 13న చివ‌రిసారిగా ఎమ్మెల్యేల‌తో సీఎం జగన్ సమావేశం అయ్యారు. అయితే ఏప్రిల్ లో జ‌రిగే స‌మావేశం ద్వారా నేత‌ల ప‌నితీరుపై ఒక నిర్ణయానికి వ‌స్తాన‌ని గ‌తంలోనే జగన్ చెప్పారు. దీంతో ఈసారి స‌మావేశంలో ఎవ‌రి భ‌విష్యత్ ఏంట‌నే దానిపై సీఎం ఓ స్పష్టం ఇస్తారని తెలుస్తోంది. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్రభుత్వం కార్యక్రమంతో పాటు స‌చివాల‌య క‌న్వీన‌ర్లు, వాలంటీర్ల ప‌నితీరుపైనా ఈ సమావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉందంటున్నారు ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడిన ‘జ‌గ‌న‌న్నే మా భ‌విష్యత్తు’ క్యాంపెయిన్ ఈ నెల రెండో వారం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్యాంపెయిన్ పై పార్టీ కేడ‌ర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయ‌నున్నారు.

IPL_Entry_Point