CM Jagan: విశాఖ ప్రమాద బాధితులకు నేటి నుంచి పరిహారం చెల్లింపు - సిఎం జగన్
CM Jagan: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు నేటి నుంచి చెక్కుల పంపిణీ చేపట్టనున్నట్టు సిఎం జగన్ వివరించారు. ప్రమాదంలో బోట్లు తగులబడిన వారికి ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
CM Jagan: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో బోట్లు కాలిపోయిన వారికి ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లిస్తుందని సిఎం జగన్ ప్రకటించారు. నేటి నుంచి చెక్కుల పంపిణీకి చర్యలు చేపట్టాలని మంత్రితో పాటు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. బోటు ప్రమాద బాధితుల్ని ఉదారంగా ఆదుకోనున్నట్లు ప్రకటించారు.

భారీ వర్షాలతో ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా పర్యటన వాయిదా పడటంతో కోనసీమ జిల్లాలో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం విడుదల కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా నిర్వహించారు.
ఓఎన్జీసీ కార్యకలాపాలతో ఉపాధి కోల్పోయిన వారికి క్రమం తప్పకుండా ఓఎన్జీసి నుంచి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు సిఎం జగన్ తెలిపారు. మత్స్యకారులకు సంబంధించి మంచి కార్యక్రమం సుళ్లూరు పేటలో జరగాల్సి ఉందని, త్వరలోనే ఆ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిన మంచిని ఆ రోజు వివరిస్తామని జగన్ చెప్పారు.
ఓఎన్జీసీ పైప్‌లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు ఓఎన్జీసీ ద్వారా నాలుగో విడత పరిహారంగా నెలకు రూ.11,500చొప్పున ఆర్నెల్లకు రూ.69వేల పరిహారాన్ని చెల్లించనున్నారు. ఇందుకుగాను రూ.161.86కోట్ల ఆర్ధిక సాయాన్నిసిఎం క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.
ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వరకు అర్హత ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి ఏటా రూ.10వేల రుపాయలు చెల్లిస్తున్నారు. మర, యాంత్రిక పడవలతో పాటు సముద్రంలో సాంప్రదాయ పడవలపై చేపలు వేటాడే వారికి కూడా మత్స్యకార భరోసా ద్వారా ఆర్ధిక సాయం అందిస్తున్నారు. నాలుగేళ్లలో ఈ పథకంలో రూ.538కోట్ల రుపాయలు అందించినట్లు తెలిపారు.
విశాఖపట్నంలో జరిగిన ఘటనలో 40బోట్లు కాలిపోయాయని తెలిసిన వెంటనే వారిని ఆదుకోవడం ఎలా అనే దానిపై ఆలోచన చేసినట్లు చెప్పారు. ఇన్స్యూరెన్స్ లేదని తెలిసి బోటు విలువ లెక్క కట్టి, అందులో 80శాతం ప్రభుత్వం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అగ్నిప్రమాద బాధితులకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సిఎం ప్రకటించారు. జిల్లా కలెక్టర్, మంత్రులు తక్షణమే బాధితులకు పరిహారం అందుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.