CBN Warning : ఆడబిడ్డల జోలికొస్తే.. గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా.. చంద్రబాబు మాస్ వార్నింగ్!
CBN Warning : ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఊరుకోబోమని.. చంద్రబాబు స్పష్టం చేశారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు.
మహిళల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నివారణకు డేగకన్నుతో పని చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా సరే.. ఆడబిడ్డల జోలికొస్తే వదిలిపట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధిని పరుగులు పెట్టించిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఒక్కరోజైనా సమయం ఇవ్వాలి..
'ఏపీని స్వచ్చాంధ్ర చేయాలని సంకల్పించాం. స్వచ్ఛమైన ఆలోచనలతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలంతా నెలలో ఒక్కరోజైనా సమయం కేటాయించాలి. ప్రజాహితం, భావితరాల భవిష్యత్తు కోసమే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ప్రతి ఇల్లు కూడా పరిశుభ్రంగా తయారై రాష్ట్రాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
స్వచ్ఛత వైపు పయనం..
'మొక్కల పెంపకం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో మెరుగైన ఆరోగ్యం జీవనం పెంపొందించుకోవాలి. కలుషితమైన గాలి, పంట ఉత్పత్తుల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వినియోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ప్రజల జీవన శైలిలో మార్పులు రావాలి. పంటల్లో రసాయనాల వినియోగంతో క్యాన్సర్ బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి స్వచ్ఛత వైపు పయనించాలి' అని సీబీఎన్ సూచించారు.
కందుకూరుపై వరాల జల్లు..
'కందుకూరులో ప్రతిరోజు 25 టన్నుల చెత్త రీసైక్లింగ్ కెపాసిటీతో మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించబోతున్నాం. కందుకూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాము. కందుకూరు మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నాం. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కందుకూరు సమీపంలోని నాలుగు గ్రామాల గర్భ కండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపుతాం. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటాం' అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
దగా జరిగింది..
'గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో దగా జరిగింది. రూ. 10 లక్షల కోట్లు అప్పుచేసి పోయారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతినకుండా ఆ అప్పులు చెల్లిస్తున్నాము. ప్రజల మనోభావాలను తెలుసుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాము. ఎన్టీఆర్ హయాంలో మండల వ్యవస్థలు తీసుకువస్తే.. ప్రస్తుతం ప్రజల వద్దకే పాలన మేము తీసుకొచ్చాం. పెన్షన్లతో పేదలకు భద్రత వచ్చింది. వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రతి నెలా 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం. ఇందుకోసం ఏడాదికి రూ. 32, 520 కోట్లు వ్యయం చేస్తున్నాం' అని చంద్రబాబు వివరించారు.
త్వరలో తల్లికి వందనం..
'వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు 161 ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాం. దీపం పథకం పెట్టి దేశంలోనే మొదటిసారి గ్యాస్ అందించాము. ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము. త్వరలో ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తాం. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద రూ. 20 వేలు అందిస్తాం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
యువతకు ఉద్యోగాలు..
'రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. తద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా యువతలో వృత్తి నైపుణ్యాలు మెరుగుపరుస్తాం. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. నెల్లూరులో రూ. 330 కోట్లతో 620 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించే 10 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను, రాజమండ్రిలో రూ.340 కోట్లతో 640 మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే 12 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నాం' అని సీఎం వెల్లడించారు.