విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వారికి చంద్రబాబు సీరియస్ వార్నింగ్!-cm chandrababu warning over vishaka google date center land acquisition obstacles ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వారికి చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వారికి చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

Anand Sai HT Telugu

విశాఖలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే రైతుల పేర్లతో కోర్టులో తప్పుడు కేసులు ఫైల్ చేస్తున్న వారిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.

HT Image

విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. అయితే భూ సేకరణ విషయంలో మాత్రం కొంత వివాదం నడుస్తోంది. భూసేకరణను వ్యతిరేకిస్తూ.. రైతుల పేర్లతో కోర్టులో తప్పుడు కేసులు వేయడం, చనిపోయిన వ్యక్తిపేరు కూడా ఉండటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆటంకాలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలన చెప్పారు. భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు.

ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులకు ఆటంకాలు కలిగించే.. ఆలోచనలతో వైసీపీ పెద్దల తరఫున పని చేస్తున్న బినామీల విషయంలై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగవకాశాలు, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్, ఇళ్ల నిర్మాణానికి 3 సెంట్ల స్థలంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భూసేకరణ ప్రాంతాల్లో పరిహారం ప్రకటించిన తర్వాత దాన్ని పెంచడం అనేది ఎక్కడా లేదని చంద్రబాబు అన్నారు. అయితే ఇక్కడి రైతుల అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని ధర పెంచామని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా భూ సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.

అంతకుముందు విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని చంద్రబాబు అన్నారు. 'ఆడబిడ్డలు కష్టపడకూడదని అప్పుడు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇప్పుడు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం.'అని సీఎం చంద్రబాబు అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడి రూ.11,400 కోట్లు ఇప్పించామని చెప్పారు చంద్రబాబు. విశాఖ ఐటీ హబ్‌గా మారబోతుందన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు విశాఖకు తరలివస్తాయని చెప్పారు. ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలన్నది తన ఉద్దేశమని అన్నారు. రైతుల ఆదాయం పెరగాలని చంద్రబాబు అన్నారు.

'యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఏడాదిలోపు మెగా డీఎస్సీ నిర్వహించాం. యువతకు అండగా ఉంటూ ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చాం. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటితో 9 లక్షల ఉద్యోగాలు వస్తాయి.' అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.