Rushikonda : రుషికొండకు చంద్రబాబు.. కొత్త భవనాల వినియోగంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్!
Rushikonda : విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ముఖ్యంగా రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవానలను పరిశీలించనున్నారు. ఈ భవనాల వినియోగంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే.. రహదారి గుంతలు పూడ్చేపనుల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలుత ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:20కి అనకాపల్లి జిల్లా వెన్నెలపాలేనికి చేరుకొని.. రహదారి గుంతలు పూడ్చేపనుల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 1:25కి చంద్రబాబు రుషికొండ చేరుకోనున్నారు. ఏపీ టూరిజం రిసార్ట్స్‌ను పరిశీలించనున్నారు. మధ్యాహ్మం 2:30కి కలెక్టరేట్‌లో అధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. 40 అంశాలపై కలెక్టర్ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించనున్నారు. హైవేల అభివృద్ధి, బీచ్ కారిడార్, మెట్రోపై చర్చించనున్నారు.
గత ప్రభుత్వం విశాఖ సమీపంలోని రుషికొండపై రూ.500 కోట్లతో భవనాలను నిర్మించింది. అయితే.. ప్రస్తుతం ఆ భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. ఏ కార్యక్రమాల కోసం వాటిని వినియోగించడం లేదు. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు ఉపయోగపడవని కూటమి నేతలు చెబుతున్నారు. కన్వెన్షన్ సెంటర్‌గా మార్చుకునే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. ఇవాళ దీనిపై చర్చించే అవకాశం ఉంది.
ప్రభుత్వ కార్యకలాపాల కోసం వాడుకుందాం అనుకున్నా.. చాలా భారమవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ భవనాలను దేనికైనా వినియోగిస్తే కేవలం విద్యుత్ బిల్లులే నెలకు రూ.25 లక్షల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇంకా ఇతర నిర్వహణ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు.
గతేడాది నవంబర్ నుంచి రుషికొండలోని భవనాలకు కరెంట్‌ను వాడుతున్నారు. అప్పటి నుంచి నెలకు సగటున రూ.7 లక్షల కరెంట్ బిల్లు వస్తోంది. అప్పటి నుంచి బిల్లులు చెల్లించలేదు. దీంతో ఇప్పటి వరకు దాదాపు రూ.85 లక్షల బకాయిలు ఉన్నాయి. కేవలం రాత్రిపూట విద్యుద్దీపాలు వెలిగించినందుకే ఈ స్థాయిలో కరెంట్ బిల్లు వచ్చిందని చెబుతున్నారు. పూర్తిస్థాయిలో వినియోగిస్తే.. ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి శ్రీకాకుళం జిల్లాలోనే బస చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇవాళ అనకాపల్లికి వెళ్లనున్నారు. విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన రద్దు అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పర్యటన రద్దు చేసినట్టు సీఎంవో అధికారులు వివరించారు.