CM Chandrababu : మధ్యతరగతి కుటుంబాలకు రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా, పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు- సీఎం చంద్రబాబు-cm chandrababu says health insurance for middle class free treatment poor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : మధ్యతరగతి కుటుంబాలకు రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా, పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు- సీఎం చంద్రబాబు

CM Chandrababu : మధ్యతరగతి కుటుంబాలకు రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా, పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు- సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఏడాది రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ, పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూ.25 లక్షల ఉచిత చికిత్స అందిస్తామని ప్రకటించారు.

మధ్యతరగతి కుటుంబాలకు రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా, పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు- సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దడానికి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో మాట్లాడుతూ...ఎన్టీఆర్ వైద్య సేవను హైబ్రిడ్ విధానం‌లోకి విస్తరిస్తామన్నారు. బీమా, పీఎంజేఏవై, ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు రూ.2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని, పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందిస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేస్తున్నామన్నారు. ఆరోగ్య బీమా పథకం ద్వారా రాష్ట్రంలో ఒక కోటి అరవై లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజాహితం కోసం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతి పౌరుడికి ఆర్థిక భద్రత, నాణ్యమైన చికిత్స, ఆరోగ్య సంరక్షణ అందనున్నాయని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమాను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా అందిస్తున్నట్లు ప్రభుత్వం సీఎం చంద్రబాబు తెలిపారు. మెగాడీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీ ప్రకారం... వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే నియామకాలు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు సభలో ప్రకటించారు. డీఎస్సీ ఇప్పటికే ప్రకటించామని, త్వరలోనే 16,354 టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పోస్టింగులు ఇచ్చాకే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు.

మే నెలలో తల్లికి వందనం

"ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. మే నెలలో తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుడతాం. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింపజేస్తాం. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి మూడు విడతల్లో ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇస్తాం. మత్స్యకారులకు రూ. 20 వేలు ఆర్థిక సాయం చేస్తాం"- సీఎం చంద్రబాబు

సూపర్ సిక్స్ లో భాగంగా, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దీపం పథకం కింద పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 48 గంటల్లో లబ్ధిదారులు కట్టిన డబ్బు తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.2,684 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. కోటి మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 93 లక్షలమందికి గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. సమైక్యాంధ్రలో దీపం పథకం తెచ్చామని, ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా వంటగ్యాస్ ఇస్తున్నామన్నారు.

దేశంలో అతి పెద్ద సంక్షేమ పథకం

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నీ అమలుచేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అనుక్షణం తాము ఇచ్చిన హామీలు కోసం పనిచేస్తామన్నారు. వచ్చీ రాగానే పెన్షన్ రూ.1000 పెంచాంమన్నారు. ఈ దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఇదేదని అన్నారు. ఏడాదికి రూ.33 వేల కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం