CM Chandrababu: ఎస్సీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు, అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన మళ్లీ ప్రారంభిస్తాం -సీఎం చంద్రబాబు-cm chandrababu says 20 thousand crores for the welfare of scs ambedkar foreign education scheme resumed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu: ఎస్సీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు, అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన మళ్లీ ప్రారంభిస్తాం -సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఎస్సీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు, అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన మళ్లీ ప్రారంభిస్తాం -సీఎం చంద్రబాబు

CM Chandrababu : అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో ఈ స్కీమ్ ద్వారా రూ.467 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎస్సీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్ల ఖర్చుపెట్టబోతున్నామని తెలిపారు.

ఎస్సీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు, అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన మళ్లీ ప్రారంభిస్తాం -సీఎం చంద్రబాబు

CM Chandrababu : అంబేడ్కర్‌ విదేశీ విద్యా దీవెన పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించిన ఆయన... అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నవీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపును పరిశీలించారు.

సొంతూరిలోనే బంగారు భవిష్యత్తు

అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేడ్కర్‌ పోరాడారని గుర్తుచేశారు. దళితులకు టీడీపీ ఎప్పుడూ అండగా నిలబడుతుందన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్‌సభ స్పీకర్‌గా చేసింది టీడీపీ అని గుర్తుచేశారు. సొంతూరిలోనే బంగారు భవిష్యత్తు ఉందని యువత భావిస్తున్నారన్నారు. సబ్ ప్లాన్ ద్వారా దళితుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు. దళితులకు 8 లక్షల ఎకరాలను గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిణీ చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు.

గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనం చేశారు. బీఆర్ అంబేడ్కర్‌ చిత్రపటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం పీ4 లబ్ధిదారులతో సమావేశమై... మార్గదర్శులు, బంగారు కుటుంబం లబ్ధిదారులతో ముచ్చటించారు. అంబేడ్కర్ విదేశీ విద్యాదీవెన కోసం గతంలో రూ.467 కోట్లు ఖర్చు చేశామన్నారు. వైసీపీ హయాంలో కేవలం 437 మందికే అవకాశం కల్పించారని ఆరోపించారు. ఎస్సీ వర్గాల ఆదాయం పెంచే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

ఎస్సీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు

"ఎస్సీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్ల ఖర్చుపెట్టబోతున్నాం. ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దళితుల విద్య, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి పాటుపడుతున్నాం. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలు ఇచ్చాను. ఎస్సీ విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు. వీరిని బాగా చదివిస్తే ప్రపంచాన్ని సాధిస్తారని అప్పట్లో ఎన్టీఆర్ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఎస్సీ పిల్లలందరూ చదువుకునే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ పెడతాం" - సీఎం చంద్రబాబు

ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్యతో పాటు, ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే ఎస్సీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. త్వరలో ఇళ్లపై సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసి, విద్యుత్ వినియోగం అనంతరం అమ్ముకునేందుకు చర్యలు చేపడతామన్నారు. యూనిట్ విద్యుత్ రూ.2.09 కొనుగోలు చేస్తామని చెప్పారు. 2019-24 మధ్య ఎప్పుడూ చూడని భయంకర రాజకీయాన్ని చూశానని సీఎం చంద్రబాబు అన్నారు. చివరకు తాను కూడా బయటకు రాలేని పరిస్థితి కల్పించారన్నారు. వైఎస్ జగన్‌ హెలికాప్టర్‌లో వస్తుంటే కిందనున్న చెట్లను నరికివేశారన్నారు.

అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి

"2014-19లో అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి ద్వారా విదేశాలకు వెళ్లిన మా విద్యార్థులతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు వారు ఎంత బాగా రాణిస్తున్నారో చూడటం హృదయపూర్వకంగా ఉంది. వారి విజయాన్ని కోరుకుంటున్నాను, వారి మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని నేను వారిని ప్రోత్సహించాను.

విద్య ద్వారా విద్యార్థులు దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మారడానికి వారికి అధికారం ఇచ్చినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ దీనికి అతిపెద్ద ఉదాహరణ. బాబాసాహెబ్ విదేశాలలో ఉన్నత విద్యాసంస్థలలో చదువుకుని, మన దేశానికి బలమైన పునాదులు వేయడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు" -సీఎం చంద్రబాబు

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం