అనవసరంగా రాజకీయం చేస్తున్నారు... బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు - సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు-cm chandrababu said that no state will lose due to godavari banakacherla project ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అనవసరంగా రాజకీయం చేస్తున్నారు... బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు - సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అనవసరంగా రాజకీయం చేస్తున్నారు... బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు - సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. కుప్పం పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన… వృథా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం చంద్రబాబు

గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని చెప్పారు. వృథా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.

నేను అభ్యంతరం చెప్పను - సీఎం చంద్రబాబు

“ఏటా సగటున 2 వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి..వృథా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్ట్. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. ఇకపై కూడా అభ్యంతరం చెప్పను” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సముద్రంలో పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రాజెక్టులపై తానెప్పుడు వ్యతిరేకించలేదన్నారు. నీటి సమస్య పరిష్కారమైతే తెలుగు ప్రజలు బాగుంటారని పేర్కొన్నారు.

రైతులు అర్థం చేసుకోవాలి: ముఖ్యమంత్రి

"ఈ ఏడాది మామిడి దిగుబడి అధికంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ సమస్యలతో కొనుగోళ్లలో ఇబ్బందులు వస్తున్నాయి. పూర్వాకాలంలో మామిడి చెట్లు ఇళ్లలో మాత్రమే ఉండేవి. ఆ తర్వాత మామిడి వాణిజ్య పంటగా మారింది. తమిళనాడులో లేని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏపీలో ఉంది. ఆహార అలవాట్లు మారడం వల్ల పంటల సాగుపై ప్లానింగ్ ఉండాలి. రైతులు ఏ పంటలు పండించాలో సూచనలు ఇస్తాం. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి.. రైతులు అర్థం చేసుకోవాలి" అని సీఎం చంద్రబాబు కోరారు.

“తప్పుడు ప్రచారాలు తాత్కాలికం.. చేసిన పనులే శాశ్వతం. ఏమీ చేయలేనివాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు. నేనెప్పుడూ తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదు. కారు కింద పడిన వ్యక్తిని ఆస్పత్రికి కూడా తరలించే ఓపిక లేదా? కనీస బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా? కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా. కంప చెట్లలో పడేసి వెళ్లారంటే మానవత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నా. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా…? నేరచరిత్ర కలిగినవాళ్లు రాజకీయ ముసుగు వేసుకుని వస్తున్నారు” అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.